DailyDose

₹10వేలు కావాలని బాబు డిమాండ్-తాజావార్తలు

₹10వేలు కావాలని బాబు డిమాండ్-తాజావార్తలు

* రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విచ్చలవిడిగా పెరిగిపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి, ఫ్రంట్‌లైన్‌ వారియర్ల భద్రత, టెస్టింగ్‌ సరళిలో మార్పులు, చికిత్సా సౌకర్యాల మెరుగుపై ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీవనోపాధి సాయం కింద ప్రతి పేద కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందించడంతో పాటు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ 2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు జీవనోపాధి నిమిత్తం భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా వైద్యం ఖర్చులు భరించలేని స్థితి, జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోవడం వంటి అంశాలపై తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. భారమైన హృదయంతో, తీవ్ర వేదనతో ఈ లేఖ రాస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూనే ఉన్నా.. పెడచెవిన పెట్టిన పర్యవసానంగా రాష్ట్రం మొత్తం కరోనా వ్యాపించిందని లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసులు 4లక్షలు దాటిపోయినా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడ్డారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్ల ఆరోగ్య భద్రత అతి ముఖ్యమైన అంశమని, వారందరికీ పీపీఈ కిట్లు అందించాలన్నారు.

* 1. స్మార్ట్‌ కార్డుతోనే మెట్రో ప్రయాణం..!

అన్‌లాక్‌ 4.0లో భాగంగా తాజా మార్గదర్శకాలతో మెట్రో రైళ్ల సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీ ప్రభుత్వం మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కేవలం స్మార్ట్‌ కార్డులతోనే ప్రయాణానికి అనుమతిస్తామని ప్రకటించింది. మెట్రో రైలు టికెట్లలో భాగంగా ఇచ్చే టోకెన్ల‌ను ఇక నుంచి జారీచేయమని స్పష్టంచేసింది. కేవలం స్మార్ట్‌ కార్టులు, డిజిటల్‌ పేమెంట్‌ పద్ధతులతోనే ప్రయాణికులను అనుమతిస్తామని వెల్లడించింది. సెప్టెంబర్‌ 7వతేదీ నుంచి మెట్రో సేవలను పునఃప్రారంభిస్తామని దిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. క్రమశిక్షణ లేకుంటే చర్యలు తప్పవు: బండి

భాజపా నూతన పదాధికారుల తొలి భేటీ ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు. బూత్‌స్థాయి నుంచి జాతీయ నాయకుల వరకు అందరూ క్రమశిక్షణతో ఉండాలని, లేని పక్షంలో పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బోస్‌మన్‌ మృతి: ఆ ట్వీట్‌కు అత్యధిక లైకులు

హాలీవుడ్‌ నటుడు చాడ్విక్‌ బోస్‌మన్‌(43) మృతి ప్రపంచ సినీ ప్రేక్షకులను నిర్ఘాంతపరిచింది. ‘బ్లాక్‌ పాంథర్‌’ సినిమాతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న బోస్‌మన్‌ పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడి కుటుంబసభ్యులు అతడి ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. కాగా ఆ ట్వీట్‌కు నెటిజన్లు అత్యధిక మంది లైకులు కొట్టారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 6.5 మిలియన్ల లైకులు వచ్చాయి. 3 మిలియన్ల మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసి నటుడికి ఘన నివాళి అర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నూతన్‌ నాయుడిని ఎందుకు అరెస్టు చేయరు?

దళితులపై దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. అధికార వైకాపా నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైకాపా నేతలు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. విశాఖ కేసులో నూతన నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బాలకృష్ణ కెరీర్‌లో ఈ రోజు ప్రత్యేకం

తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆగస్టు 30వ తేదీతో ఆయన వెండితెరకు పరిచయం అయి 46ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రం ద్వారా బాలకృష్ణ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విడుదలైన(30/08/1974) సరిగ్గా నేటికి 46ఏళ్లు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. దావూద్‌ మా దేశ పౌరుడు కాదు..!

అండర్‌ వరల్డ్‌ డాన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశపౌరసత్వం లేదని కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా స్పష్టం చేసింది. దావూద్‌ ఇబ్రహీంకు మా దేశ పాస్‌పోర్ట్‌ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది. దావూద్‌ డొమినికన్‌ పాస్‌పోర్టు కలిగివున్నాడని వస్తోన్న వార్తలను ఆ దేశం ఖండించింది. అతనికి తమ దేశ పౌరసత్వం లేదని, అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతో కూడా దావూద్‌కు ఎలాంటి పౌరసత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎల్జీ రెక్కల ఫోన్‌ వచ్చేస్తోంది..!

ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీకి ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సమాయత్తమైంది. ఎల్జీ ‘వింగ్‌’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.75వేలు) ఉండొచ్చని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కెప్టెన్‌గా ఇప్పుడే అతి ముఖ్యమైన పని: శ్రేయస్‌ అయ్యర్‌

గతేడాదితో పోలిస్తే ఈ ఐపీఎల్‌ సీజన్‌ కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని, ఇలాంటి సవాళ్లే తనని మరింత ఉత్సాహానికి గురి చేస్తాయని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. కొద్దిసేపటి క్రితం ట్విటర్‌ వేదికగా ఐపీఎల్‌ పేజీలో విడుదల చేసిన ఓ వీడియోలో అతడు మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఒక కెప్టెన్‌గా రాబోయే సీజన్‌ కచ్చితంగా నాకు అతి ముఖ్యమైన పనిని అప్పజెప్పింది. అందుకు కారణం ఇప్పుడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితులే’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఘర్షణ: రష్యా వర్సెస్‌ అమెరికా..!

అణు మహా శక్తులైన రష్యా, అమెరికాల సైన్యాల మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. వారం వ్యవధిలోనే ఈ రెండు దళాలు రెండు సార్లు ముఖాముఖీ తలపడ్డాయి. ఈ రెండు సార్లు రష్యా దళాలు దూకుడుగా అమెరికాకు చెందిన వాహనాలు, విమానాలపైకి వెళ్లాయి. వీటిల్లో ఒకసారి నేరుగా రష్యా వాహనాలు అమెరికా సాయుధ వాహనానలను ఢీకొన్నాయి కూడా. ఓ పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఈ ఏనుగుకు స్వచ్ఛభారత్‌పై మక్కువ ఎక్కువ

ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్‌ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, ఈ గజరాజు మాత్రం దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచింది. ఎక్కడో తెలియదుగానీ, తన పరిసరాల్లో చెత్తను గమనించిన ఏనుగు తొండంతో తీసి సమీపంలోని ఉన్న చెత్తబుట్టలో వేసి స్వచ్ఛస్ఫూర్తిని చాటింది. గజరాజు చెత్తను డబ్బాలో పడేస్తున్న దృశ్యాలను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.ఈ ఏనుగును స్వచ్ఛభారత్‌ మస్కట్‌గా వాడాలని ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* తెలంగాణలో పెరిగిన పంటల విస్తీర్ణం మేరకు రైతులు ఇబ్బంది పడకుండా సరిపడా ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయాధికారులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహంలో వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు యూరియా అందుబాటు, పంటల విస్తీర్ణం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా యూరియా పంపిణీ సక్రమంగా జరగాలని.. దీనికోసం అవసరమైతే తాను స్వయంగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడతో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున సాగు విస్తీర్ణం పెరిగిందని.. ఆ మేరకు ఎరువుల వాడకం గణనీయంగా ఉంటుందన్నారు. దానికి తగ్గట్టుగా ఎరువుల సరఫరా జరగాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందిస్తామని అధికారులకు ఆయన హామీ ఇచ్చారు.

* విరసం నేత వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని చెప్పారు. 81 ఏళ్ల వరవరరావుపై జాలి చూపమనే కోరానని స్పష్టం చేశారు. వరవరరావు విడుదలపై జోక్యం చేసుకోవాలంటూ ఉపరాష్ట్రపతికి భూమన ఇటీవల లేఖ రాశారు. దీన్ని సునీల్‌ దేవ్‌ధర్‌ తప్పుబట్టారు. ట్విటర్‌ ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భూమన స్పందిస్తూ ఉపరాష్ట్రపతికి లేఖ రాయడానికి గల కారణాలపై వివరణ ఇచ్చారు. తన రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని.. వెంకయ్యనాయుడు, వరవరరావుతో కలిసి జైల్లో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. అందుకే వరవరరావు విషయంపై వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెట్టడం బాధించిందని సునీల్‌ దేవ్‌ధర్‌ను ఉద్దేశించి భూమన వ్యాఖ్యానించారు.