ScienceAndTech

చైనా చాప కింద నీరులా భారత నేవీ

చైనా చాప కింద నీరులా భారత నేవీ

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న తన బలగాలపై దాడికి దిగిన చైనాకు విస్పష్ట హెచ్చరిక చేసేందుకు భారత్‌ అనూహ్య చర్యను చేపట్టింది. మెరుపు వేగంతో స్పందిస్తూ.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. ఇది డ్రాగన్‌కు కలవరం పుట్టించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం ఉంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్‌.. ఆ సాగరంలో మెజార్టీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2009 నుంచి డ్రాగన్‌.. ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులను పెంచింది. కృత్రిమ దీవులనూ నిర్మించింది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన వెంటనే భారత్‌.. దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని వివరించాయి. భారత్‌తో జరిగిన దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని డ్రాగన్‌ లేవనెత్తిందని తెలిపాయి. మన చర్యపై అసంతృప్తి వ్యక్తంచేసిందని పేర్కొన్నాయి.