Business

రుణాల కిస్తీలు కట్టడానికి సిద్ధమవ్వండి-వాణిజ్యం

రుణాల కిస్తీలు కట్టడానికి సిద్ధమవ్వండి-వాణిజ్యం

* రిలయన్స్‌ చేతికి బిగ్‌బజార్‌.ఇతర ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలూ.అందులో ఎఫ్‌బీబీ, సెంట్రల్‌, బ్రాండ్‌ఫ్యాక్టరీ..రూ.24,713 కోట్లకు కొంటున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ప్రకటన.ఇ-కామర్స్‌లో పెరగనున్న పోటీ.అనుకున్నట్లే జరిగింది. బియానీ వ్యాపారాలను అంబానీ కొనుగోలు చేయడం ఖాయమైంది. బిగ్‌బజార్‌ మొదలుకుని ఎఫ్‌బీబీ, సెంట్రల్‌, బ్రాండ్‌ఫ్యాక్టరీ వంటి రిటైల్‌, టోకు వ్యాపారాలన్నీ రిలయన్స్‌ పరం కానున్నాయి. అంతే కాదు.. పలు ఇతర విభాగాలనూ సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్‌ఎంటర్‌ప్రైజెస్‌లో 13 శాతానికి పైగా వాటాను కూడా సొంతం చేసుకోనుంది. ఆ మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌) శనివారం ప్రకటించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ నుంచి రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారం, లాజిస్టిక్స్‌-వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ ఒప్పందం కాంపోజిట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ కింద జరుగుతుందని.. కొనుగోలు విలువలో సర్దుబాట్లు ఉండవచ్చనీ స్పష్టం చేసింది. ప్రతిపాదిత కొనుగోలు ఫ్యూచర్‌ గ్రూప్‌ చేపట్టిన విలీనంలో భాగంగా ఉండనుంది. కాగా, ఈ ఒప్పందానికి సెబీ, సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ, వాటాదార్లు, తదితరుల అనుమతి లభించాల్సి ఉంది.

* ఉద్యోగుల్లో పని సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అలసత్వం, ఆశ్రితపక్షపాతం, అవినీతిలాంటి జాఢ్యాలతో సరిగా పనిచేయని వారిని నిర్బంధ ఉద్యోగ విరమణ నిబంధనల కింద 30 ఏళ్ల సర్వీసు లేదంటే.. 50/55 ఏళ్ల వయోపరిమితి దాటిన వెంటనే ఇంటికి పంపించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఫండమెంటల్‌ రూల్స్‌ 56(జె), (ఐ), రూల్‌ 48 సీసీఎస్‌ (పెన్షన్‌)-1972ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర  సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

* రుణ మారటోరియం (చెల్లింపులకు విరామం) గడువును మరింత పొడిగించే అవకాశాలు కన్పించడం లేదు. కరోనా సంక్షోభంతో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించకుండా మారటోరియం గడువును పెంచుకుంటూ పోతే రుణాలపై వారి వైఖరిలో మార్పులు రావచ్చని, ఉద్దేశపూర్వక ఎగవేతలు పెరగవచ్చని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం నుంచి ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ రుణాల తిరిగి చెల్లింపులపై స్వల్పకాల విరామాన్ని కల్పించింది. తొలుత మార్చి 1 నుంచి మే 31 వరకు ప్రకటించిన మారటోరియం గడువును మరో మూడు నెలలు పెంచి ఆగస్టు 31 వరకు పొడిగించింది. మారటోరియం గడువు ను మరింత పొడిగించవద్దని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌, హెచ్‌డీఎ్‌ఫసీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ ఆర్‌బీఐని కోరారు. రుణం తిరిగి చెల్లించగలిగే స్తోమత ఉన్నప్పటికీ కొందరు రుణగ్రహీతలు ఈ వసతిని దుర్వినియోగం చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌తో వ్యాపార, కార్పొరేట్‌ రంగ కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని, ఆదాయ పునరుద్ధరణతో మారటోరియం లో ఉన్న రుణఖాతాలూ తగ్గాయని బ్యాంకర్లు అంటున్నారు. ఆర్థికంగా ఇప్పటికీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు, ఇప్పట్లో ఆదాయం మెరుగయ్యే అవకాశాలు లేని కంపెనీలు, వ్యక్తుల కోసం ఆర్‌బీఐ ఏక కాల రుణ పునర్‌ వ్యవస్థీకరణ (వన్‌టైం లోన్‌ రీస్ట్రక్చర్‌)ను ప్రకటించింది. కార్పొరేట్‌తోపాటు రిటైల్‌ రుణ గ్రహీతలూ ఈ వసతిని ఉపయోగించుకోవచ్చని ఈనెలలో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష సందర్భంగా వెల్లడించింది. బ్యాంకులు వీరికి రుణ చెల్లింపుల గడువును గరిష్ఠంగా రెండేళ్లపాటు పొడిగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ రుణ పునర్‌ వ్యవస్థీకరణ  అవసరమైన, అర్హులైన వారికి మాత్రమే వర్తింపజేయాలని  బ్యాంకులకు నిర్దేశించింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఔషధ సంస్థ వోకార్డ్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.759.75 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.36.88 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు 62 ఉత్పత్తులతో కూడిన వ్యాపారాన్ని, బద్దీ తయారీ కేంద్రాన్ని బదిలీ చేయడం కలిసొచ్చింది. ఇక మొత్తం ఆదాయం రూ.733.66 కోట్ల నుంచి రూ.606.22 కోట్లకు తగ్గింది. గత త్రైమాసికంలో కంపెనీ భారత విపణిలోకి కొత్త కెమికల్‌ ఎంటిటీ (ఎన్‌సీఈ)ను విడుదల చేసింది. ట్యాబ్లెట్‌, ఇంజెక్షన్‌ విభాగం కింద విడుదల చేసిన బ్రాండ్‌కు ‘ఎమ్‌రాక్‌ ఓ అండ్‌ ఎమ్‌రాక్‌’ పేరు పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా పరిశోధనా, అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తామని వోకార్డ్‌ స్పష్టం చేసింది.