DailyDose

తెలంగాణాలో ఉత్సాహంగా కరోనా-TNI బులెటిన్

తెలంగాణాలో ఉత్సాహంగా కరోనా-TNI బులెటిన్

* తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిని 24 గంటల్లో 1873 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. తాజాగా వైరస్‌ బాధితుల్లో 9 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 827 కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 1849 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 92,837. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,299. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 73.3 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు 1.78 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.66 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 37,791 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 13,65,582 నమూనాలు పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది.

* ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 56,490 నమూనాలను పరీక్షించగా 10,004 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 85 మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో 12 మంది, చిత్తూరు 9, ప్రకాశం 9, కడప 8, అనంతపురం 7, తూర్పుగోదావరి 7, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కర్నూలు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 4, కృష్ణా 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,969కి చేరింది. ఒక్కరోజులో 8,772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 37,22,912 నమూనాలను పరీక్షించారు.

* కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు.

* కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్‌లు ప్రయోగదశలో ముందున్నాయి. భారత్‌లోనూ మానవులపై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి సహకారంతో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ‘కొవాగ్జిన్’‌ టీకా తొలిదశ ప్రయోగాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. తాజాగా రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. వీటికోసం భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌, ఎస్‌యూఎం ఆసుపత్రి ఏర్పాట్లు చేస్తోంది.