DailyDose

మీ వీలునామాలో ఇవి ఉన్నాయా?

మీ వీలునామాలో ఇవి ఉన్నాయా?

కరోనా మహమ్మారి విజృంభణతో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. దీని బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటమే మనకు ఇప్పుడు రక్ష. ఈ క్లిష్ట సమయంలో ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండక తప్పదు. కుటుంబ పెద్దలుగా ఉన్నవారు.. తమ తర్వాత తమ వారసులకు ఆయా ఆస్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేయాల్సిందే. ఇందుకోసం వీలునామా రాయడం ఒక మార్గం. మరి, దీన్ని రాయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దామా!
*సంపాదించిన ఆస్తులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వారసులకు అందాలని అందరూ అనుకుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ తమ వంతుగా వీలునామా రాస్తుంటారు. చూడ్డానికి ఇది చిన్న విషయంగానే అనిపించినా.. ఎంతో ప్రశాంతంగా.. ఆలోచించి, విశ్లేషించి తీసుకోవాల్సిన నిర్ణయం. ముందుగా మీకున్న స్థిర, చరాస్తుల వివరాలు, పెట్టుబడులు, నగదు, ఇతర ఆస్తులన్నింటి వివరాలను ఒక దగ్గర రాసుకోండి. ఆ తర్వాత ఏయే పెట్టుబడులకు ఎవరిని నామినీగా రాయాలనే వివరాలు నమోదు చేయండి. ఒకటికి రెండు సార్లు మీ ఆస్తుల వివరాలు తనిఖీ చేసుకోండి. ఏమైనా మర్చిపోయారా గుర్తు చేసుకోండి. ఇలా జాబితా సిద్ధం చేయడంతో సగం పని అయినట్లు అవుతుంది.
**న్యాయ సలహాతో..
వీలునామా ద్వారా ఎలాంటి ఆస్తులను వారసులకు బదిలీ చేయొచ్చు… వేటిని చేయలేం అనేది తెలుసుకునేందుకు అవసరమైతే న్యాయ సలహా తీసుకోండి. మీ జీవితకాలంలో సంపాదించినవి, కొన్నవి, సృష్టించినవి, వారసత్వంగా వచ్చినవి.. ఇలా ఆస్తులు వేర్వేరు రకాలుగా ఉంటాయి. మీరు సంపాదించిన ఆస్తులు, భూములు, కారు, నగలు, నగదులాంటివి వీలునామా ద్వారా మీకు ఇష్టమున్న వారికి బదిలీ చేయొచ్చు. మీ వీలునామాలో మీకున్న అప్పులు, ఇతర బాధ్యతలనూ ప్రస్తావించవచ్చు. వారసత్వ ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీటి విషయంలోనే కొన్నిసార్లు న్యాయ సమస్యలు రావచ్చు. కాబట్టి, ఒకసారి మీ న్యాయవాదిని సంప్రదించి, స్పష్టంగా తెలుసుకోండి.
**రిజిష్టర్‌ చేయించండి
వీలునామాను రిజిస్ట్రేషన్‌ చేయించడం తప్పనిసరి కాదు. కానీ, రిజిష్టర్‌ చేయించడం వల్ల దాన్ని ఎవరైనా మోసపూరితంగా మార్చడం, చోరీ చేయడంలాంటివి జరగకుండా నిరోధించవచ్చు. రిజిష్టర్‌ అయిన వీలునామాను సవాలు చేయడం అంత తేలికా కాదు. అయితే, వీలునామాలో ఇక ఎలాంటి మార్పులూ చేయనవసరం లేదు అని పూర్తి నమ్మకం ఉన్నప్పుడే రిజిష్టర్‌ చేయించడం మంచిది.
**మార్చాల్సి వస్తే..
కొన్ని సందర్భాల్లో వీలునామాను మార్చాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ముఖ్యంగా నామినీలుగా పేర్కొన్న వ్యక్తులకు ఏదైనా జరిగినా.. కొత్త ఆస్తులు కొన్నా.. పాత ఆస్తులను విక్రయించినా వీలునామా తప్పనిసరిగా మార్చాల్సిందే. ఇలాంటప్పుడు ఏం చేయాలనే విషయంలోనూ అవగాహన ఉండాలి. దీనికోసం వీలునామాకు అనుబంధాలను రాయొచ్చు. లేదా.. పాత విల్లు చెల్లదని పేర్కొంటూ మరో కొత్త వీలునామానూ రాసే వీలుంది. మార్చిన ప్రతిసారీ తేదీలను పేర్కొనడం మాత్రం మర్చిపోవద్దు.
**వారసులకు చెప్పండి..
వీలునామా రాసిన సంగతి వారసులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. వారితోపాటు దగ్గరి బంధువులకు కూడా సమాచారం ఇవ్వాలి. అనుకోనిదేదైనా జరిగినప్పుడు వీలునామా ఉన్న సంగతి తెలియకపోతే.. దాని ప్రయోజనం శూన్యం అవుతుంది.