DailyDose

వైద్యులకు సరికొత్త రిజర్వేషన్లు-తాజావార్తలు

వైద్యులకు సరికొత్త రిజర్వేషన్లు-తాజావార్తలు

* పీజీ కోర్సుల అడ్మిషన్లలో సర్వీసు వైద్యులకు రిజర్వేషన్‌ కల్పించేందుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ తరహా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వెల్లడించింది. ఓ వైద్యుల సంఘం వేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం వారికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి ఈ అధికారం లేనప్పటికీ.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం ఉందని స్పష్టం చేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కనీసం 5 సంవత్సరాలు సేవ చేసిన వైద్యులకే ఈ అవకాశం కల్పించేలా సవరణలు చేస్తే బాగుంటుందని రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం చేపడుతున్న ప్రవేశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, వచ్చే ఏడాది నుంచి చేపట్టబోయే ప్రవేశాలకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీం స్పష్టం చేసింది.

* వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని రకాల విచారణలు నేటితో ముగియనున్నాయి. అయోధ్యలోని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది వాదనలు వినిపించేందుకు సోమవారమే తుది గడువు. ఈ కేసులో ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, సాధ్వి రీతాంబర వంటి ప్రముఖులు ఉన్నారు. ఆగస్టు 31వ తేదీలోపు వారందరి రాతపూర్వక సమాధానాలు లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి సురేందర్‌కుమార్‌ యాదవ్‌ గతంలోనే ఆదేశించారు. కేసుకు సంబంధించి సీబీఐ రాతపూర్వక వాదనను ఇదివరకే సీబీఐ ప్రత్యేక కోర్టుకు అందజేసింది.

* జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను ఆగస్టు 2023 నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే చేపట్టాలని సీఎం ఆదేశించారు. సర్వే బృందాలను పెంచి అక్కడికక్కడే వివాదాలను పరిష్కరించాలన్నారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

* ఇప్పటి వరకు పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపు తన సైనిక కార్యకలాపాల్ని ప్రారంభించేందుకు కుట్ర పన్ని తోకముడిచిన డ్రాగన్‌ సేన.. తాజాగా సరస్సు దక్షిణం వైపు కన్నేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగటానికి ఒక్కరోజు ముందే చైనా ముందు జాగ్రత్త చర్యగా జే-20 యుద్ధవిమానాలను లద్దాఖ్‌ సరిహద్దులకు తరలించినట్లు తెలిసింది. హోటన్‌ , గార్‌ గున్సా వాయుసేన స్థావరాల్లో వీటి కదలికలు చురుగ్గా ఉన్నాయి. భారత సరిహద్దులకు సమీపంలో సార్టీలకు కూడా వచ్చినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

* జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత సైన్యంపై మరోసారి దాడికి యత్నించారు. బారాముల్లా నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనేడ్లతో దాడులు జరిపారు. అవి వాహనాలపై పడకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే రోడ్డుపై వెళ్తున్న స్థానికులపై అవిపడ్డాయి. దీంతో ఆరుగురు స్థానికులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

* కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొన్నిరోజులకే అలసట, ఒళ్లు నొప్పుల సమస్యలతో ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం ఉదయం డిశ్చార్జి చేసినట్లు ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. తాజాగా, ఓనమ్‌ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

* ప్రశాంత్‌ భూషణ్‌.. ఇప్పుడు వార్తల్లో నానుతున్న సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది. ఆయన పలు మార్లు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. న్యాయపాలికలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో ప్రాథమిక హక్కులు.. వాక్‌ స్వాతంత్ర్యం వంటి అంశాలకు రాజ్యాంగాన్ని అన్వయించుకోవడం వంటి కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రశాంత్‌ భూషణ్‌కు మద్దుతు పెరుగుతూ వస్తోంది. న్యాయస్థానం కూడా వివాదాన్ని ముదరనీయకుండా భూషణ్‌ క్షమాపణ చెప్పే అవకాశాన్ని ఇచ్చింది. దానికి ఆయన నిరాకరించడంతో ఇప్పుడు న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి వచ్చింది.

* అమెరికాలో నల్లజాతీయుడు జాకోబ్‌ బ్లేక్‌పై పోలీసుల కాల్పులకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసకారులు, రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులకు మధ్య శనివారం ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

* కాంగ్రెస్‌ పార్టీలో పాత-కొత్త నేతల మధ్య ఎలాంటి పోరూ లేదని సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ స్పష్టం చేశారు. యువ నేతల్ని ప్రోత్సహించిన అనేక దాఖలాలు పార్టీ చరిత్రలో కనిపిస్తాయని, అది ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతూ వస్తోందని చెప్పారు. తనతోపాటు కమల్‌నాథ్, గులాంనబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, ఆనంద్‌శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ వంటి అనేకమంది యువకులుగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరామని గుర్తు చేశారు. అందువల్ల పాత, కొత్త నేతల మధ్య సమరమేమీ లేదన్నారు. ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం విషయంలో కొందరు నేతలు లేఖ రాయడంపై ఎవరికీ అభ్యంతరం లేదని, దానికి ఎంచుకున్న సమయం, పాటించిన విధానమే అధిష్ఠానానికి నచ్చలేదని రావత్‌ చెప్పారు. ఆజాద్, అహ్మద్‌ పటేల్‌ వంటి నేతలకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంపై కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రధాని నరేంద్రమోదీ తీరును ఆయన దీటుగా ఎండగడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్యటించి, అవగాహన తెచ్చుకున్న యువనేతగా రాహులే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని రావత్‌ అభిప్రాయపడ్డారు. అంతర్గత ఎన్నికలు అవసరమేనని, దానికి తగిన సమయం రావాలని చెప్పారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్‌ వద్ద ఉందన్నారు.

* పాకిస్థాన్‌ గూడచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ని గుజరాత్‌లో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ కేసు విచారణలో లభించిన ఆధారాలతో ఎన్‌ఐఏ నేడు అతడిని అదుపులోకి తీసుకుంది.

* త్వరలో బిహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నప్పటికీ కాంగ్రెస్‌ ఇంకా దానిని ఎదుర్కొనే సన్నద్ధతతో లేకపోవడంపై పార్టీలో కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ఇటీవల తలెత్తిన అంతర్గత సమస్యల నేపథ్యంలో అధిష్ఠానం ఇంకా ఈ విషయం మీద దృష్టి సారించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. భావసారూప్య పక్షాలతో త్వరలోనే పొత్తు ఖరారు కాబోతోందని పార్టీ వ్యూహకర్తలు మాత్రం నమ్మకంగా చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నా అక్టోబరు-నవంబరు మధ్య బిహార్‌ శాసనసభా సమరం జరిగేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకి, విపక్షాలకు నడుమ జరిగే మరో పెద్ద ఎన్నికలుగా విశ్లేషకులు వీటిని చూస్తున్నారు. ఆ రాష్ట్రంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)కి అక్కడ పట్టు ఎక్కువ.