DailyDose

విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా-తాజావార్తలు

విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా-తాజావార్తలు

* విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా!ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో సంతాప దినాలుఏడు రోజుల పాటు వాయిదా పడిన కార్యక్రమం7న లేదా 8న ప్రారంభోత్సవం జరిగే అవకాశంవిజయవాడలోని ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు నిర్మించిన దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో, వారం రోజుల తర్వాత ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 7న లేదా, 8న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. ఇటీవలే ఫ్లైఓవర్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా అప్ లోడ్ చేయగా… అది వైరల్ అయింది.

* కరోనా వైరస్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. అన్ని రంగాలూ దెబ్బతినడంతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలకు సంబంధించి రూ 86,449 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే మాసంలో రూ.98,202 కోట్లు మేర జీఎస్టీ వసూలు కాగా.. అప్పటితో పోలిస్తే 11,553 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ మాసంలో 90,917 కోట్లు, జులై మాసంలో 87,422 కోట్లు చొప్పున వసూలు కాగా.. ఈసారి మాత్రం అంతకన్నా తక్కువ పన్ను వసూలు కావడం గమనార్హం.

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 59,834 నమూనాలను పరీక్షించగా 10,368 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,45,139కి చేరింది. మరోవైపు 24 గంటల్లో 84 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమగోదావరి 11, తూర్పుగోదావరి 10, అనంతపురం 7, గుంటూరు 7, విశాఖపట్నం 7, నెల్లూరు 6, కడప 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విజయనగరం జిల్లాలో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,053కి చేరింది. ఒక్కరోజులో 9,350 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,82,746 నమూనాలను పరీక్షించారు.

*విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం వద్ద ఏడుగురు తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ పరిశీలనకు తెదేపా బృందం వెళ్లింది. తిరిగి వచ్చి ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా వైకాపా ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు తమపై దాడి చేశారని తెదేపా కార్యకర్తలు తెలిపారు. గతంలో ఎంపీ నందిగం సురేశ్‌పై సోషల్‌ మీడియాలో తెదేపా నేత పట్టాభిరాం వద్ద పనిచేస్తున్న అజయ్‌ పోస్టులు పెట్టారు. ఆ కోపంతోనే బూతులు తిడుతూ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు అజయ్‌ చెప్పారు. మైనింగ్‌తోపాటు తమ నాయకుడు జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

* దళితులపై దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. అధికార వైకాపా నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైకాపా నేతలు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. విశాఖ కేసులో నూతన నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నూతన్‌ నాయుడు వైకాపా సిద్ధాంత కర్త కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

* రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఆ కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోర్సులు, శిక్షణ అందివ్వాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

* భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దిల్లీలోని లోధి శ్మశానవాటికలో ప్రణబ్‌ ముఖర్జీ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రణబ్‌ పార్థివ దేహంపై సైనికులు జాతీయ పతాకం ఉంచారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారమే ఈ కార్యక్రమం పూర్తిచేశారు.

* భారత్‌-చైనా సరిహద్దుల్ని కచ్చితంగా నిర్ణయించలేదని.. అందువల్ల ఎప్పటికీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

* రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ అంశం సుప్రీంకోర్టు, ఎన్జీటీ పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

* నగరంలో గణేశ్‌ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్‌సాగర్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు.

* దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 4 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు మొదలుపెట్టింది. అధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. మరో వంద రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.