* మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివిధ రుణాలపై మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానికి తెలియజేసింది. మారటోరియం వ్యవధిలో వడ్డీని పరిగణించే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన కోర్టు న్యాయంగా ఆలోచించాలని కేంద్రానికి హితవు పలికింది. ఈ విచారణపై ఎక్కువ ఆలస్యం చేయదలచుకోలేదన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీనిపై రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని తెలిపింది.
* సోమవారం నాటి భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. మంగళవారం ఉదయం 9:48 గంటల సమయంలో సెన్సెక్స్ 276 పాయింట్లు ఎగబాకి 38,905 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.96 వద్ద కొనసాగుతోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకొచ్చిన లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ ఏకంగా 23.9 శాతం కుంగినా.. మదుపర్లపై ఇది పెద్దగా ప్రభావితం చేయలేదు. దీన్ని ముందుగా అంచనా వేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అలాగే అన్‌లాక్‌తో క్రమంగా వివిధ రంగాలు పుంజుకుంటుండడంతో రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి రేటు గాడిన పడుతుందన్న నమ్మకం మదుపర్లలో ఏర్పడింది. అలాగే టెలికాం సంస్థలు చెల్లించాల్సిన ఏజీఆర్ ఛార్జీలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
* టై హైదరాబాద్ విభాగం నిర్వహించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్-2020లో విజేతగా నోట్‌ఫైండ్ నిలిచింది. జులైలో దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభమైన ఈ పోటీకి మొత్తం 207 దరఖాస్తులు రాగా, 42 మందిని ఎంపికయ్యారు. వీరిని ఏడు బృందాలుగా విభజించి పోటీని ఏర్పాటు చేశారు. ఇలా ఈ ఒక బృందం ఆలోచన నోట్‌ఫైండ్ విజేతగా నిలిచింది. విద్యార్థులు తమ ఇష్టమైన అంశాలపై వీడియో పాఠాలు రూపొందించి అందించాలన్నది ఈ ఆలోచన. అందించే నోట్‌ఫైండ్‌కు అవార్డు లభించింది. దీంతోపాటు విద్యార్థులు బొమ్మలు, ప్రాజెక్టులు తయారు చేయడంలో ఉపకరించే క్రాఫ్టియమ్, వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసే షాపింగ్ కార్ట్ వివిధ విభాగాల కింద విజేతలుగా నిలిచాయి. విద్యార్థి దశ నుంచే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారిని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు టై హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్, కంట్రోల్‌ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు.
* జీవిత, సాధారణ బీమా పాలసీలను జారీ చేసేందుకు వీడియో ఆధారిత కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి)ని వాడుకునేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) బీమా సంస్థలకు అనుమతినిచ్చింది. కొవిడ్-19 పరిస్థితుల్లో పాలసీదారులను వ్యక్తిగతంగా కలిసే వీలు లేకపోవడం, బీమా సంస్థలు పాలసీలను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఈ వీడియో ఆధారిత కేవైసీ తోడ్పడనుంది. ఇప్పటికే ఆర్‌బీఐ కేవైసీ నిబంధనల విషయంలో మార్పులు చేసింది. వీడియో కేవైసీకి అనుమతిని జారీ చేసింది. బీమా సంస్థలకు ఐఆర్‌డీఏ జారీ చేసిన లేఖలో కేవైసీని సరళీకృతం చేయడంతోపాటు, అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మార్గాలనూ వాడుకోవచ్చని సూచించింది. వ్యక్తిగత గుర్తింపుగా దీన్ని వాడుకునేందుకు కేవైసీ నిర్వహించే వ్యక్తి వీడియోను రికార్డు చేయడం, ఫొటోలను తీసుకోవడంలాంటివి చేయొచ్చని తెలిపింది. బీమా సంస్థలు ఒక యాప్‌ను అభివృద్ధి చేసి, వీడియో కేవైసీని నమోదు చేసే ప్రక్రియను చేపట్టే వీలును పరిశీలించాల్సిందిగా సూచించింది.
* సినిమా ప్రేమికులకు జీ ఎంటర్టేన్‌మెంట్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. త్వరలో ‘సినిమా టు హోమ్’, జీప్లెక్స్ సేవలను వినియోగదారులకు అందించనుంది. కాగా తమ సినిమా టు హోమ్ సేవల ద్వారా వినియోగదారులు, సినీ నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని జీ ఎంటర్టేన్‌మెంట్ తెలిపింది. అయితే ఎంటర్టేన్‌మెంట్ ప్టాట్‌ఫార్మ్‌లో తమ సేవలు నూతన ఒరవడి సృష్టిస్తాయని పేర్కొంది. ఈ విషయమై జీ స్టూడియో సీఈఓ షారీక్ పటేల్ స్పందిస్తు.. నూతన సాంకేతికతో జీప్లెక్స్ సేవలను ప్రారంభించనున్నామని, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సేవలను అందిస్తామని తెలిపారు.