Fashion

ఆత్మహత్యలు చేసుకునేది ఎక్కువగా పురుషులే!

ఆత్మహత్యలు చేసుకునేది ఎక్కువగా పురుషులే!

భారత దేశంలో 2019లో సగటున రోజుకు 381 మంది ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. 2018తో పోలిస్తే ఇది 3.4% అధికం. 2019లో ఆత్మహత్య చేసుకొని 1,39,123 మంది చనిపోతే.. 2018లో ఆ సంఖ్య 1,34,516. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన 2019 ఆత్మహత్య గణాంకాల ప్రకారం ప్రతి వంద మందిలో 70.2% మంది పురుషులు చనిపోతుంటే.. మహిళల మరణాల శాతం 29.8. ఇందులో వివాహం తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్న పురుషులు 68.4% కాగా మహిళల్లో అది 62.5%. దేశం మొత్తం సగటు(10.4%)తో పోలిస్తే నగరాల్లోనే ఆత్మహత్యల రేటు అధికం (13.9%) అని తేలింది. ఉరి వేసుకొని 53.6% మంది చనిపోతుంటే..విషం తీసుకొని 25.8%, నీళ్లలో మునిగి 5.2%, నిప్పంటించుకొని 3.8% మంది మరణిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా 32.4% ఆత్మహత్యలు చేసుకుంటుంటే.., వివాహసంబంధ సమస్యలతో 5.4%, అనారోగ్యకారణాలతో 17.5% మంది తమను తాము చంపుకుంటున్నారు. అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలో (18,916) సంభవిస్తున్నాయి. తర్వాత స్థానాలు తమిళనాడు (13,493), పశ్చిమబెంగాల్‌ (12,665), మధ్యప్రదేశ్‌ (12,457), కర్ణాటక (11,288). ఈ ఐదు రాష్ట్రాల్లోనే 49.5 శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామూహిక లేదా కుటుంబ ఆత్మహత్యల్లో తమిళనాడులో (16) అగ్రస్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ (14) రెండో స్థానంలో నిలిచింది.