ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 157వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సులో తెలుగు భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ అన్నలూరు విచ్చేసి “ఆంధ్ర అభ్యుదయ సాహిత్యంలో కొన్ని కెరటాలు” అనే అంశంపై ప్రసంగించారు. సాహితి, సింధూరల “జయ జయ భారత వీరుడా” అంటూ అలనాటి అనిసెట్టి సుబ్బారావు గేయాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు, పొడుపు కథలను ఉరుమిండి నరసింహారెడ్డి ప్రయోగించారు. ఉపద్రష్ట సత్యం పిల్లలమర్రి చినవీరభద్రుడు రచించిన శాకుంతలా కావ్యం అవతారికలోని ఒక అందమైన పద్యాన్ని విశ్లేషించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” శీర్షకను పునః ప్రారభించి, ఆగస్టు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను స్మరణకు తెచ్చారు. బల్లూరి ఉమాదేవి గిడుగు వారు రచించిన సవరల నిఘంటువునూ, వారి జీవన ప్రస్థానాన్నీ వివరిస్తూ మహోన్నతమైన వారి వ్యక్తిత్వాన్ని గురించి కూడా వివరించి స్పూర్తినిచ్చారు. భాషా దినోత్సవ వేడుకను కొనసాగిస్తూ, గ్రాంథిక వ్వవహార భాషల పరిణామ క్రమాన్ని వేముల లెనిన్ బాబు సోదాహరణంగా వివరించారు. చిన్నయసూరి, సురవరం ప్రతాపరెడ్డి, చలం లాంటి మహారచయితల గ్రాంథిక, సరళ గ్రాంథిక, వ్యవహార భాషలలో రాయబడిన కొన్ని పంక్తులను చదివి వినిపించారు. “ఆంధ్ర అభ్యుదయ కవిత్వంలో కొన్ని కెరటాలు” శీర్షికలో బాలగంగాధర తిలక్ సాహిత్య సౌరభాలను అన్నలూరు పవన్ సభకు అందించారు. కార్యక్రమంలో ప్రసాదు తుర్లపాటి, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
డాలస్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Related tags :