కర్ణాటకలో బియ్యం ఏటీఎంలు త్వరలో!
బెంగళూరు : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పథకం లబ్దిదారులకు నిరంతరం బియ్యం అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బియ్యం ఏటీఎంలను ఏర్పాటు చేసి, వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ బియ్యం అందజేయాలని నిర్ణయించింది.
బియ్యం ఏటీఎంలను కర్ణాటకలో వివిధ చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే గోపాలయ్య తెలిపారు.
బియ్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బారులు తీరి నిల్చోవలసిన అవసరం ఉండబోదని గోపాలయ్య చెప్పారు. వియత్నాంలో అమలు చేస్తున్న విధానాన్ని తాము ఆదర్శంగా తీసుకున్నామన్నారు. తాము మొదట రెండు ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తామని, అవి విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.
కోవిడ్-19 అష్ట దిగ్బంధనం సమయంలో వియత్నాం ప్రభుత్వం బియ్యం పంపిణీ యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఉచితంగా వీటి ద్వారా బియ్యం అందజేసింది.