* తమ వ్యాపార సామర్థ్యాలను, వ్యూహాలను సమర్థంగా వినియోగించుకోవడం కోసం హైబ్రిడ్ మల్టీ క్లౌడ్ ప్లాట్‌ఫాంపై పెట్టుబడులు పెంచుకోవాలని భారత వ్యాపార దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ఐబీఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన బిజినెస్ వేల్యూ సర్వే స్పష్టం చేసింది. భారత, అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న ఈ సర్వే ప్రకారం.. ‘ప్రస్తుతం ఐటీ వ్యయాల్లో 17 శాతం క్లౌడ్‌పై పెడుతుండగా.. ఈ వాటాను 2023 కల్లా 42-49 శాతానికి పెంచుకోవాలని ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. ఎక్కువ వ్యయాలు హైబ్రిడ్ క్లౌడ్ ప్లాట్‌ఫాంపైనే కేటాయించనున్నారు. ఎందుకంటే వీరి పబ్లిక్ క్లౌడ్ వ్యయాలు 50 శాతం నుంచి 43 శాతానికి తగ్గనున్నాయి. భవిష్యత్‌లో చాలా వరకు పరిశ్రమలు క్లౌడ్ సంఖ్య రూపంలో తమ వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీమా, టెలికాం, రిటైల్‌లో వచ్చే మూడేళ్లలో 10 క్లౌడ్స్ వరకు వినియోగించుకోవచ్చు.’
* విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
* దేశంలో పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. దీనికి ‘ఫౌజీ’ (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) అని పేరుపెట్టారు. త్వరలో ఈ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
* మన వద్ద నగదు ఉంటే భద్రత ఉండదని బ్యాంకుల్లో దాచుకుంటాం. కానీ బ్యాంకులు పలు నిబంధనలు పెట్టి సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై బ్యాంక్ ఖాతాదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏటీఎంల్లో నగదు ఉపసంహరణలు నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు.. గత కొన్నాళ్లుగా బీమ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తున్నాయి. తాజాగా ఈ విషయం కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు(సీబీడీటీ) దృష్టికి రావడంతో బ్యాంకుల తీరును తప్పుపట్టింది. వసూలు చేసిన ఛార్జీలను తిరిగి ఇవ్వాలని తాజాగా సూచించింది.
* సహారా గ్రూప్‌పై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తు చేపట్టాలని ద సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కోరింది. గ్రూప్‌నకు చెందిన నాలుగు సహకార సంస్థలు పెట్టిన పెట్టుబడుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించింది. అయితే ఆ సొసైటీలు మాత్రం ఆ ఆరోపణలను ఖండించాయి. పెట్టుబడులన్నీ చట్టం ప్రకారమే జరిగాయని తెలిపాయి.
* బ్యాంకింగ్, ఫార్మా, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైన వేళ దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 633.76 పాయింట్లు నష్టపోయి 38,357.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 193.6 పాయింట్లు కోల్పోయి 11,333.9 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.13 కొనసాగుతోంది.