ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షం వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ ‘అన్న వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు మహబూబ్ బాషా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ).. వైఎ్‌సఆర్‌సీపీ అన్న పేరు వాడేందుకు వీల్లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఆదేశించినా.. ఆ పార్టీ లెక్క చేయడం లేదని.. అందుచేత దాని గుర్తింపు రద్దుచేయాలని బాషా పిటిషన్ వేశారు. దానిపై న్యాయమూర్తి జస్టిస్ జయంతనాథ్ గురువారం విచారణ జరిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని ప్రతివాదులుగా ఉన్న ఈసీ, వైసీపీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.
దాంతో న్యాయమూర్తి ఇంకో నాలుగు వారాలు గడువిచ్చారు. తదుపరి విచారణను నవంబరు 4వ తేదీకి వాయిదా వేశారు. కాగా.. మహబూబ్ బాషా ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కౌంటర్ వేయాలని కోర్టు గతంలోనే ఆదేశించినా.. ప్రతివాదులు ఇంతవరకు దాఖలు చేయలేదని చెప్పారు. నిబంధనలు, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వైసీపీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం చేసుకోవాలని, కానీ తమ పార్టీని పోలిన విధంగా వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్పుకొంటోందని ఆక్షేపించారు. ఆంధ్ర రాజధాని మార్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని బాషా వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతానని తెలిపారు. సీఎంగా జగన్ విఫలమయ్యారని విమర్శించారు.