WorldWonders

రాయలసీమలో వజ్రాల వాన

రాయలసీమలో వజ్రాల వాన

వానాకాలం వచ్చిందంటే చాలు అనంతపురం జిల్లాలోని గుత్తి వజ్రకరూరు, కర్నూలు జిల్లాలోని తుగ్గలి మొదలైన మండలాలలో వజ్రాలవేట మొదలైతుంది.

వర్షానికి భూమిపై పొరలలోని మట్టి కొట్టుకుపోయి అతి చిన్న గులకరాళ్ళు తేలుతాయి.అందులో వజ్రాలు దొరుకుతాయని ఆశావహులు ఏరివేత కార్యక్రమం మొదలు పెడతారు. 10వేల మందిలో ఒకరికో ఇద్దరికో వజ్రాలు దొరికేమాట వాస్తవమైనా, అవి దళారుల పాలు కావడం కూడా అంతే వాస్తవం.

నిజానికి ఈ ప్రాంతాలకన్నా గుంటూరు జిల్లాలోని కొల్లూరు వజ్రపరిశ్రమకు పేరు. ఇక్కడ దాదాపు 1460 ప్రాంతంలోనే వజ్రపరిశ్రమ అభివృద్ధి చెందినట్లు విదేశీయాత్రికుల వ్రాతలు తెలియచేస్తున్నాయి. టావెర్నియర్ (1605-89) అనే ఫ్రెంచివజ్రాల వ్యాపారి, యాత్రికుడు కొల్లూరులోని వజ్రాలపరిశ్రమను గురించి విపులికించాడు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడ లభించిందే. టావెర్నియర్ ఇక్కడికి రావటానికి వందసంవత్సరాల పూర్వమే జొన్న విత్తుదామని దున్నుతుంటే అతనికి 25 కేరట్ల వజ్రం దొరకడంతో వజ్రాల పరిశ్రమ మొదలైందని వ్రాశాడు.

మెథవోల్ట్ అనే యాత్రికుడు వజ్రాల తయారీగురించి క్రింది విధంగా వ్రాశాడు. ఆయన చూచినపుడు 30 వేలమంది కూలీలు మట్టిని త్రవ్వుతున్నారు. దాదాపు 10 నుండి 15 అడుగుల వరకు గోయిని త్రవ్వి మట్టిని ఒకచోట కుప్పగా పోస్తారు.ఆ మట్టిలో బాగా నీరుపోసి అడుసులా తయారుచేసి రెండుమూడు రోజులు నాననిస్తారు.

ఆ తరువాత మట్టికుప్ప మీద నీటిని ధారగాపోస్తారు.ఆ నీటిధారకు మట్టంతా కొట్టుకుపోతుంది. ఇసుక మిగులుతుంది.ఆ ఇసుకను బాగా ఆరబెడతారు.ఆ ఇసుకను ధాన్యాన్ని తూర్పారబట్టినట్టు తూర్పారబెడతారు. దుమ్ముదూళి ఎగిరిపోయి స్వచ్ఛమైన ఇసుక మిగులుతుంది. అపుడు కర్రలతో ఇసుకను బాది అందులో వజ్రాలకోసం వెతుకుతారు.

ఇక్కడ దొరికే వజ్రాలు 40కేరట్ల వరకు వుండేవి. అవి ఎర్రగానో నల్లగానో వుండేవని సానపట్టినపుడు అవి తెల్లగా మెరిస్తాయని అన్నారు. ఇక్కడ అసాధారణంగా 900 కేరట్ల వజ్రం దొరికిందని అది మొగలు ఔరంగజేబుకు చేరిందని చరిత్రకారులు అన్నారు.

గోల్కొండ సుల్తాన్ సైనికాధికారి / ఆర్థికాధికారి ఆధీనంలో ఈ వజ్రాల గనులుండేవి. అతను వీటిని తనవారికి గుత్తకిచ్చేవాడు. పెద్దవి అమూల్యమైన వజ్రాలు దొరికితే తనపరం చేయాలనే షరుతు విధించాడు.

అలా ఒకసారి 900 కేరట్లున్న వజ్రం దొరికింది. అది 1657 లో షాజహనుకు చేరింది. తరువాత వెనిస్ నగరానికి చెందిన బోర్జియో సానపెట్టాడు. అపుడు దాని బరువు 286 కేరట్లైంది. ఇదే కోహినూర్ వజ్రం. ఇది డిల్లీనుండి పర్షియాకు, ఆఫ్ఘనిస్థాన్ కు, లాహోర్ కు, చివరకు మహరాజా రంజిత్ సింగ్ కుమారుడైన దులీప్ సింగ్ సర్ హెన్రీ లారెన్స్ ద్వారా ఇంగ్లాండుకు చేరింది.

ప్రముఖచారిత్రక రచయిత కాకాని చక్రపాణి గారి కుతుబ్ షాహీలు నుండి సేకరణ.