అమెరికాలో నవంబరు 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం కావాలంటూ అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకూ సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) లేఖలు రాసింది. ఇందుకుగాను ఈ వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీడీసీ నుంచి కాంట్రాక్టు పొందిన ‘మెక్‌కెస్సాన్ కార్ప్’ సంస్థకు అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా కోరింది. ఈ సంస్థకు కావలసిన అన్ని రకాల మినహాయింపులు, అనుమతులూ వేగంగా మంజూరు చేయాలని సూచించింది. అలాగే, ఈ మినహాయింపుల వల్ల ప్రజారోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 27న సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ రాష్ట్రాల కు లేఖ రాశారని అమెరికా మీడియా పేర్కొంది.
వ్యాక్సిన్ ఎలా వేయాలి, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనే విషయాలను తెలుపుతూ 3 దస్త్రాలను వైద్య ఆరోగ్య విభాగాలకు సీడీసీ పంపిందని తెలిపింది. అక్టోబరు చివరి నాటికి మొత్తం రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నది. కాగా, అధ్యక్ష ఎన్నికలకు 2 రోజుల ముందే వ్యాక్సిన్ తేవాలన్న ప్రభుత్వ హడావిడి నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తికాలేదని, కొన్ని సంస్థలైతే వలంటీర్లను నియమించుకునే దశలోనే ఉన్నాయని అంటున్నారు. ఈ దశలో అక్టోబరులోపు ఈ ప్రక్రియ ఎలా పూర్తవుతుందని వారు వాదిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న సమస్య కావడంతో హడావిడి నిర్ణయాలు సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.