* భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఆయా ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. రైల్వేలో భారీగా ఉద్యోగ నియామకాలకు రైల్వేశాఖ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అభ్యర్థులందరికీ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని వివేక్‌యాదవ్ తెలిపారు. ఈ పరీక్షల ప్రక్రియను డిసెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతుండటంతో వాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వల్ల నిలిచిపోయిన ఈ పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. రైల్వేశాఖ గతంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం నాన్ టెక్నికల్ పాపులారిటీ కేటగిరీ (ఎన్‌టీపీసీ) కింద గార్డులు, ఆఫీస్ క్లర్క్‌లు, కమర్షియల్ క్లర్క్‌ల పోస్టులు 35,208 కాగా.. మినిస్టీరియల్ కేటగిరీ ఉద్యోగాలైన స్టెనో తదితర ఉద్యోగాలు 1663; అలాగే, ట్రాక్ నిర్వహణ, పాయింట్‌మెన్ వంటి ఉద్యోగాలు 1,03,769లను భర్తీ చేయనున్నారు.
* గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ పరిధిలో కనీసం 10 లక్షల మంది నివాసం లేనివారు ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటి వరకు 128 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో డివిజన్ యాత్ర చేపట్టానని, తెరాస విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని పేర్కొన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం,వరంగల్ ఎన్నికల్లో పురపాలక మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు.
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 65 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన 64 అసెంబ్లీతో పాటు, ఒక లోక్ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. బిహార్‌తో పాటే వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం జరిగిన సమావేశంలో ఈసీ నిర్ణయం తీసుకుంది.
* ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు.. ఉచిత విద్యుత్ ను యథాతథంగా పునరుద్ధరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు రైతుల పాలిట గుదిబండలా మారాయని విమర్శించారు. ‘‘ వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం పేరిట మీటర్లు బిగిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు రైతుల ప్రాణాలు తీయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 22 ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం ..సీమ, మెట్టప్రాంతం రైతుల మనోభావాలు దెబ్బతీస్తోంది. వైకాపా ప్రభుత్వ నయవంచన రోజుకొకటి బయటపడుతోంది’’ అని చంద్రబాబు విమర్శించారు.
* తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్ శేఖర్ తెలిపారు. అనారోగ్యంతో ఉండడంతో ఎమ్మెల్యే ఇవాళ ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.ఈ పరీక్షల్లో యనకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసిన నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
* అన్ని మతాలను తెలంగాణ రాష్ట్రం సమానంగా ఆదరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. పరమత సహనం పాటిస్తుందని చెప్పారు.పూర్తి ప్రభుత్వ ఖర్చుతో కొత్త సచివాలయ ప్రాంగణంలో మందిరం, మసీదు, చర్చి నిర్మిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకేరోజు ప్రార్థనా మందిరాలన్నింటికీ శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ముస్లిం సంస్థల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. కొత్త సచివాలయంలో మసీదు నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇమామ్ క్వార్టర్స్‌తో సహా 2 మసీదులను నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు. పాత సచివాలయం ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం చేపడతామన్నారు. తర్వాత వాటిని వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తామని చెప్పారు. 1500 అడుగుల విస్తీర్ణంలో మందిరాన్ని నిర్మించి దేవాదాయశాఖకు అప్పగిస్తామన్నారు. క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని హామీ ఇచ్చారు.
* సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ఆక్రమించింది.
* సమావేశం వేదికగా చైనా రక్షణ మంత్రితో జరిగిన భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంగా తెలియజేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లోని గల్వాన్ లోయ సహా వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలపై రాజ్‌నాథ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు.
* ఐపీఎల్ పదమూడో సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈరోజు లేదా రేపు వెల్లడించే అవకాశలున్నాయి. మరోవైపు ఐపీఎల్ నిర్వాహకులు శనివారం ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ‘డ్రీమ్ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం’ అని పేర్కొంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్‌ల ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్యా తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
* కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. 2021 ద్వితీయార్ధం వరకు వాటిని భారీ స్థాయిలో పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వరకు చేరుకున్నాయి.
* నటి కంగనా రనౌత్‌ను బెదిరింపులకు గురిచేసిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్‌ను వెంటనే అరెస్టు చేయాలని.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. ‘‘శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్ ఓ ఇంటర్వూలో కంగనను బెదిరించారు. ముంబయి పోలీసులు ఆయనను వెంటనే అరెస్టు చేయాలి. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంటున్నాం’’ అని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
* పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. యంత్రాల్లో చిప్‌లు అమర్చి తక్కువ పరిమాణం వచ్చేలా నిందితులు చేస్తున్నారని అన్నారు.