Politics

గజపతిరాజులకు రఘురామరాజు బాసట

గజపతిరాజులకు రఘురామరాజు బాసట

విశాఖ అంతా 17వ శతాబ్దం నుంచి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యుల పాలనలో ఉందని, 300 ఏళ్ల నుంచి వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే మాన్సాస్ ట్రస్ట్ నడుస్తోందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతి రాజును తొలగిస్తూ ఆయన స్థానంలో సంచైతను నియమించడంపై రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఇప్పటివరకు ఆ కుటుంబంలోని పురుషులే ట్రష్టుకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మచ్చలేని రాజకీయనాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్‌ గజపతిరాజు మాత్రమేనని ఎంపీ తెలిపారు. వంశపారం పర్యంగా ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తిని తొలగించడం దురదృష్టకరమన్నారు.
‘‘ స్త్రీ, పురుషులు సమానమే… కానీ వంశ పారం పర్యంగా వస్తున్న ఆనవాయితీని తొలగించడం సరికాదు. సింహాచలం దేవస్థానంలో ఇప్పుడు జరగబోయే దోపిడీని ఆపాలి. గజపతిరాజు కుటుంబం 12 వేల ఎకరాల భూములు సింహాచలం దేవస్థానానికి ఇచ్చారు. దేవస్థానం ఆధీనంలో ఉండాల్సిన భూములు కొన్ని అన్యాక్రాంతమయ్యాయి. సింహాద్రి అప్పన్న మాన్యాలకు అన్యాయం జరుగుతోంది. సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న నిజాయితీగల అధికారి భ్రమరాంబ ఉద్యోగం చేయలేనంటూ వెళ్ళిపోయారు. కార్తిక్ అనే వ్యక్తిని ఓఎస్డీ గా నియమించారు.ప్రైవేటు నియామకాలు చేయడం దేవాలయ చట్టం ప్రకారం చెల్లదు.

రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్న నేపథ్యంలో సింహాచలం భూముల్లో పెద్ద కుంభకోణం జరుగుతోంది’’ అని రఘురామకృష్ణ ఆరోపించారు.ఎంతోమంది హిరణ్యకశిపులు విశాఖకు వస్తున్నారని రఘురామకృష్ణ విమర్శించారు. ‘‘ విశాఖ వాసులంతా నరసింహస్వామి ఆస్తులను కాపాడుకోవాలని శపథం చేయాలి. సింహాచలం భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.అశోక్‌ గజపతి రాజును ఎలా తీసేస్తారు?మీ ఇష్టానికి మీరు తీసేస్తారా?ఆయన చేసిన తప్పేంటి?అర్థరాత్రి జీవోలతో సంచైత గజపతిరాజుని నియమించారు.కోర్టు తిరిగి అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా నియమిస్తుందనే నమ్మకం నాకుంది.

ముఖ్యమంత్రికి తెలియకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారు.రాజధాని మార్పు జరుగుతుందని నేను అనుకోవడంలేదు.’’ అని రఘురామ పేర్కొన్నారు. సింహాచలం, మాన్సస్ ట్రస్ట్‌కి ఒక చరిత్ర ఉందని, దానిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సంచైతను చైర్మన్‌గా నియమించారని మండిపడ్డారు. ఛైర్మన్‌గా నియమితులైన వరకు సంచైత ఒక్కసారి కూడా గుడిని దర్శించలేదన్నారు. ఎవరి అభీష్టానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని, ఉత్తరాంధ్ర ప్రశాంతతను కాపాడాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.