‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్‌సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర.ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి.
మూడు సినిమాల నుండి తొలగింపు
Related tags :