మన ఇంట్లోకి పాము వచ్చిందని వినగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీస్తాం. అయితే, ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలోని ఒక గ్రామాన్ని ఏకంగా సర్పలోకంగా పిలుస్తుంటారు. ఆ ఊర్లోని వారికి పాములే జీవనాధారం. వారి సమాజం సంస్కృతి, సాంప్రదాయం, జీవనోపాధిలో పాముకి గొప్ప ప్రాముఖ్యం ఉన్నది. పిల్లలకు చిన్ననాటనే పాములను వారి చేతుల్లోకి ఇచ్చి వాటితో ఆడుకునేలా ప్రేరిపిస్తూ పాములను ప్రేమించే విధానం నేర్పుతారు. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుహాగ్‌పూర్‌లోని సంవారా మొహల్లా వద్ద గ్రామాల్లో పాములతో స్నేహం చేసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ విషపూరిత పాములతో ఆడుకోవడం ఈ సమాజంలోని పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ నివసిస్తున్న సంవారా సమాజం ప్రజలకు ఉపాధి సాధనంగా మాత్రమే కాకుండా.. వాటిని పుస్తా నుంచి సంప్రదాయం, సంస్కృతిలో చేర్చారు. మనకు సాధారణంగా నాగుపాము బుస వినిపించగానే భయపడిపోతాం. అదే ఇక్కడి అమాయక చిన్నారులకు ఆడుకునే బొమ్మ దొరికినట్లు భావిస్తారు. ఇక్కడి చిన్నపిల్లలకు కోబ్రా, కరైట్, అహిరాజ్ వంటి విషపూరిత పాములతో ఆడుకోవడం మహా సరదా. కట్నంలో ఏడు విషపాములు ఇక్కడి సన్వర్ సమాజంలో వివాహంలో అమ్మాయి వైపు నుంచి బహుమతిగా అన్ని వస్తువులతోపాటు ఏడు విషపూరిత పాములను కట్నంలో ఇవ్వడం సాంప్రదాయంగా ఉన్నది. ఇలా విషపూరిత పాములను కట్నంలో ఇవ్వడం వలన తమ కుమార్తె సంతోషంగా ఉంటుందని నమ్మడంతోపాటు అమ్మాయి అత్తామామల ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. సంవారా సమాజ ప్రజలు పాములపై మాత్రమే ఆధారపడి జీవిస్తుంటారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ వీధి-కూడలి వద్ద పాములను ఆడించడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. ఇప్పటికీ చాలా సమాజాలు ఇలాంటి పనులనే ఆధారంగా చేసుకుని జీవిస్తుండటం విశేషం. సరైన విద్య లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల నేటికీ వారు అభివృద్ధి ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. వీరికి ఉపాధి లేదా జీవించడానికి స్థిర స్థలం చూపించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తాచుపాములే వరకట్నం
Related tags :