మార్చిలో వార్షిక పరీక్షలు రాసేందుకు రుసుములు చెల్లించి.. హాజరుకాలేకపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనూ ఉత్తీర్ణులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. సర్కారు నుంచి వచ్చిన సంకేతాల మేరకే ప్రతిపాదన అందినందున త్వరలోనే ఆమోదం తెలుపుతూ అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరానికి చెందిన సుమారు 27 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. మార్చిలో పరీక్షలకు రెండో ఏడాది విద్యార్థులు సుమారు 4.30 లక్షల మంది హాజరుకాగా వారిలో 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా నేపథ్యంలో.. తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిపే అవకాశం లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. పరీక్షలు రాసి తప్పిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు జులై 19వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. అలా దాదాపు 1.47 లక్షల మందికి తప్పిన సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేశారు. రుసుములు చెల్లించి వివిధ కారణాల వల్ల పరీక్షలు రాయలేకపోయిన వారు ఇంకా 27 వేల మంది వరకు ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు తీసింది. వారందరూ సప్లిమెంటరీ రాయాలని అనుకున్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఈ క్రమంలో వారికి కూడా కనీస మార్కులు ఇచ్చి పాస్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.
‘అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ’పై మల్లగుల్లాలు
ఆరు మీటర్ల ఎత్తుకు మించి భవనాల్లో నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) తప్పనిసరి. ఆ నిబంధనలను సడలించడం కుదరదని అగ్నిమాపక శాఖ ఇప్పటికే స్పష్టంచేసింది. నిబంధనను అమలు చేస్తే రాష్ట్రంలోని 1586 ప్రైవేట్ కళాశాలల్లో 300 విద్యా సంస్థలకు మాత్రమే అనుమతి దక్కుతుంది. అది లేకుండా అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వడం ఇంటర్ బోర్డుకు వీలుకాదు. ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై విద్యా, హోంశాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ మేరకు స్పష్టత వస్తేనే 2020-21
విద్యా సంవత్సరానికి మొదటి ఏడాదిలో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణాలో ఇంటర్ విద్యార్థులు అందరూ పాస్
Related tags :