DailyDose

చికెన్ ధరలకు రెక్కలు-వాణిజ్యం

చికెన్ ధరలకు రెక్కలు-వాణిజ్యం

* తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌ అన్నారు గురజాడ వారు. ఆ మాట నేటి కరోనా కా లంలో అక్షర సత్యం. మహమ్మారి సోకితే తట్టుకుని నిలబడాలంటే పౌష్ఠికాహారమే దిక్కు అని ప్రజలు భావిస్తున్నారు. అందుకోసం పోషకాలు పుష్క లంగా ఉండే కోడిమాంసాన్ని, గుడ్లను భుజిస్తున్నారు. గతంలో వారాంతాల్లో ఒకసారి చికెన్‌.. వారంలో రెండు సార్లు గుడ్లు తినేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గుడ్లు, చికెన్‌ తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తుండటంతో వాటి అమ్మకాలు, డిమాండ్‌ రెండూ పెరిగి పోయాయి. కొందరైతే ఏకంగా రెండు పూటలా గుడ్డు తింటు న్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో కుటుంబం రోజుకు కనీసం 4 నుంచి 8 గుడ్లు తింటున్నట్లు ఒక అంచ నా. దీంతో పౌలీ్ట్రలో చికెన్‌ అమ్మకాలు, గుడ్ల విక్ర యాలు అమాంతం పెరిగాయి. సహజంగానే అమ్మకాలతో పాటు చికెన్‌ ధరలకూ రెక్కలొచ్చాయి. వారం రోజుల క్రితం హోల్‌సేల్‌లో కిలో చికెన్‌ ధర స్కిన్‌ లెస్‌ రూ.190 వరకు ఉండగా.. ఈ ఆదివారం ఒక్కసారిగా రూ. 60మేర పెరిగిపోయింది. ప్రస్తుతం కిలోకు రూ.240 నుంచి 250 వరకు వసూలు చేస్తున్నారు. ఇక బయటి మార్కెట్లలో కిలోకు ఏకంగా రూ. 260 నుంచి రూ. 280 వరకూ పలుకుతోంది. చికెన్‌తో పాటే గుడ్డూ ధరలూ పెరిగిపోయాయి.

* వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్‌) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు.. ఏజీఆర్‌ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ ఐడియా తనను తాను పునర్నిర్మాణం చేసుకోవడంపై దృష్టి సారించింది. తద్వారా ఇప్పటివరకు తాను కోల్పోయిన మార్కెట్‌ వాటాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాకు 28 కోట్ల మంది చందాదార్లు ఉన్నారు. ఇక నుంచి వొడాఫోన్‌, ఐడియా బ్రాండ్లను ‘వి’గా వ్యవహరించాలని కంపెనీ తెలిపింది. ఈ రెండు బ్రాండ్ల అనుసంధానంతో ప్రపంచ టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ పూర్తయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ‘రెండేళ్ల క్రితం విలీన సంస్థగా వొడాఫోన్‌ ఐడియా అవతరించింది. అప్పటి నుంచి రెండు సంస్థలకు చెందిన నెట్‌వర్క్‌ల అనుసంధానం, చందాదార్లు, విధానాల విలీనంపై దృష్టి సారించామ’ని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ చెప్పారు. బ్రాండ్ల అనుసంధానంతో కేవలం ప్రపంచంలోని టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా.. తన 4జీ నెట్‌వర్క్‌పై కోట్ల మంది భారతీయులకు అత్యుత్తమ డిజిటల్‌ అనుభూతిని అందించే దిశగా భవిష్యత్‌ ప్రయాణానికి కంపెనీ సిద్ధమయ్యిందని అన్నారు. ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీస్‌ల జారీ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనకు గత వారం కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ కొత్త బ్రాండు ఆవిష్కరణ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించేందుకు 10 ఏళ్ల సమయాన్ని సుప్రీంకోర్టు ఇవ్వడంతోనూ వొడాఫోన్‌ ఐడియా ఊపిరి పీల్చుకుంది. రుణ పరిమితిని రూ.1 లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఈ నెల 30న జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదార్ల అనుమతిని కోరనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది.

* ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీ కోత విధించింది. దాదాపు 10.5 శాతం మేర కుచించుకుపోనుందని అంచనా వేసింది. గతంలో ఇదే కాలంలో జీడీపీ 5 శాతం కుంగొచ్చని తెలిపిన సంస్థ.. మహమ్మారి విజృంభణ, దాని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మరింత కోత విధించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. సెప్టెంబరు నెలకు సంబంధించి విడుదల చేసిన గ్లోబల్‌ ఎకానమిక్‌ ఔట్‌లుక్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచంలో యూకే, స్పెయిన్‌, భారత్‌లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మందకొడిగా ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్‌ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఉదయం 9.44 సమయానికి సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 38,463 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 11,364 వద్ద ట్రేడవుతున్నాయి. ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, శ్రీరామ్‌ సిటీ, రెప్కో హోం ఫినాన్స్‌, డిష్‌టీవీ షేర్లు లాభాల్లో ఉండగా.. భారత్‌ డైనమిక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, వొడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టపోతున్నాయి.

* ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌ (ఓఎంఓ) కింద రూ.10,000 కోట్ల విలువకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ల క్రయవిక్రయాలను సెప్టెంబరు 30న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహించనుంది. రెండు విడతల్లో రూ.20,000 కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ల క్రయవిక్రయాలను నిర్వహిస్తామని ఆగస్టు 31న ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడత కింద వేలాన్ని 2020 సెప్టెంబరు 10న నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్ల విలువైన మూడు సెక్యూరిటీస్‌ను విక్రయించనుంది. ఇదే మొత్తానికి సమానమైన మూడు సెక్యూరిటీస్‌లను కొనుగోలు చేయనుంది. వేలం ఫలితాలను అదే రోజున ప్రకటించనుంది. రెండో బిదత వేలాన్ని సెప్టెంబరు 17న నిర్వహించనుంది.

* సెప్టెంబరులో స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ అంచనా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు విదేశీ మదుపర్ల పెట్టుబడులు నెమ్మదించడం ఇందుకు కారణం అవుతుందని తెలిపింది. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు తరలి రావడంతో ఆగస్టులో ఈక్విటీ మార్కెట్లు రాణించాయి. అయితే ఇక నుంచి స్థిరీకరణ అవుతాయని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ముఖ్య పెట్టుబడి అధికారి నవ్‌నీత్‌ మునోత్‌ అన్నారు. ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి -23.9 శాతానికి క్షీణించినా.. స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తుండటంపై మదుపర్లలో భయాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. మార్చిలోని కనిష్ఠ స్థాయుల నుంచి 40 శాతానికి పైగా సూచీలు పెరగడం గమనార్హం. ‘స్వల్ప కాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఎలా కదలాడుతుందో ఇప్పుడు చెప్పడం కష్టమే. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబరులో సూచీలు ఒడుదొడుకులకు, స్థిరీకరణకు లోనుకావచ్చని’ అన్నారు. మరోవైపు సోమవారం ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ చిల్డ్రన్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విడుదల చేసింది. ఇది డెట్‌ ఆధారిత పొదుపు పథకం.

* జర్మనీ విలాస కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ మధ్య స్థాయి ఎస్‌యూవీ ఏఎంజీ జీఎల్‌ఈ 53 4మేటిక్‌+ కూపే ముందస్తు బుకింగ్‌లను నేటి నుంచి ప్రారంభించనుంది. ఈ కారు భారత విపణిలోకి 23న విడుదల కానుంది. మెర్సిడెస్‌ బెంజ్‌ ఈ ఎస్‌యూవీని ఫిబ్రవరిలో జరిగిన వాహన ప్రదర్శనలో ఆవిష్కరించింది.