Editorials

అతను గెలిస్తే చైనా గుప్పిట్లోకి అమెరికా

అతను గెలిస్తే చైనా గుప్పిట్లోకి అమెరికా

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అమెరికాలో ప్ర‌చారం మ‌రింత జోరందుకుంది. అధికార రిప‌బ్లిక‌న్ల‌కు, ప్ర‌తిప‌క్ష డెమొక్రాట్ల‌కు మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు ఊపందుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ గెలిస్తే అమెరికాను డ్రాగన్ దేశం చైనా సొంతం చేసుకుటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో (నాఫ్టాతో) పాటు ప్రపంచ వాణిజ్య సంస్థలోకి చైనా ప్రవేశించడానికి గ‌తంలో డెమొక్రాట్‌లు ఒప్పందాలు చేసుకున్నార‌ని ఆరోపించారు. ఆ రెండు ఒప్పందాలు చరిత్రలోనే అత్యంత ఘోరమైన వాణిజ్య ఒప్పందాలని ఆయ‌న‌ పేర్కొన్నారు. నాఫ్టా, డబ్ల్యూటీఓలోకి చైనా ప్ర‌వేశించ‌డానికి బిడెన్ మద్ధతు తెలపడం ఘోరమ‌ని చెప్పారు. ఆ రెండు దేశ చరిత్రలో అత్యంత వినాశకర ఒప్పందాలని వ్యాఖ్యానించారు.

బిడెన్ గెలిస్తే వాటిని అడ్డుపెట్టుకుని డ్రాగన్ కంట్రీ మరింత చెలరేగే అవకాశం ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు అమెరికాను చైనా సొంతం చేసుకుటుందని, చైనాయే అమెరికాలో రాజ్య‌మేలుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను గెలిస్తే పరిపాలనలో అమెరికాను ప్రపంచంలోనే గొప్ప‌ ఉత్పాదక శక్తిగా నిల‌బెడుతాన‌ని, చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తాన‌ని ట్రంప్ హామీ ఇచ్చారు.