Food

విటమిన్-డీతో కరోనాకు చెక్!

విటమిన్-డీతో కరోనాకు చెక్!

‘విటమిన్‌-డి’కి క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్.. కరోనా కారణంగా ఐసీయూల్లో చేరిన వారి పాలిట వరంగా మారినట్లు తెలుస్తోంది. కాల్సిఫెడియోల్‌ను రోగులకు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల ఐసీయూల్లో చికిత్స పొందే అవసరాన్ని చాలావరకు తగ్గిస్తోందని స్పెయిన్‌ పరిశోధకులు వెల్లడించారు. తక్కువ ధరతో లభ్యమయ్యే, కొత్త యాంటీవైరల్‌ ఔషధాలకు సంబంధించిన అన్వేషణలో భాగంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సైన్స్‌ డైరెక్ట్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం..76 మంది కరోనా బాధితుల్లో 50 మందికి కాల్సిఫెడియోల్ ఔషధాన్ని అందించగా వారిలో ఒకరికి మాత్రమే ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఎదురైందని పరిశోధకులు వెల్లడించారు. 49మందిలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. ఆ ఔషధాన్ని స్వీకరించని వారిలో 13మంది ఐసీయూలో చేరగా, ఇద్దరు మరణించారని తెలిపారు.

‘అధిక మోతాదులో కాల్సిఫెడియోల్ లేక 25 హైడ్రాక్సీ విటమిన్‌ డి.. ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులకు ఐసీయూ అవసరాన్ని తగ్గిస్తుందని మా అధ్యయనంలో వెల్లడైంది’ అని పరిశోధకుల్లో ఒకరైన మార్టా ఎంట్రినాస్‌ కాస్టిల్లో వెల్లడించారు. ఈ ఔషధం కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ, కచ్చితమైన సమాధానం కోసం మరింత అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతానికి కరోనా వ్యాధిగ్రస్తుల్లో మరణాల సంఖ్యను తగ్గించే విషయంలో డెక్సామెథసోన్‌ స్టెరాయిడ్ మాత్రమే ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడైంది.