DailyDose

కియాపై మరోసారి చంద్రబాబు కామెంట్లు-తాజావార్తలు

కియాపై మరోసారి చంద్రబాబు కామెంట్లు-తాజావార్తలు - From Hyderabad In Telangana -

* జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీలపై దాడులు జరగని రోజులేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి జిల్లాలో వైకాపా బాధిత ఎస్సీ కుటుంబాలకు తెదేపా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెదేపా సీనియర్‌ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌ అన్నీ అసత్యాలే చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమని చెప్పారు. వైకాపా దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలను కాపాడాలని నేతలకు ఆయన సూచించారు. పారిశ్రామిక వేత్తలను వైకాపా నేతలు బెదిరించి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కియా రావడం వైకాపాకు ఇష్టం లేదని.. ఆ పార్టీ నేతల బెదిరింపులతో కియా 17 యూనిట్లు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని.. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరమని.. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలు మాస్కు ధరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసుపు చైతన్యం పేరుతో చేపట్టనున్న 100 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెదేపా శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

* ఈఎస్‌ఐ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఏసీబీ ఆస్తుల జప్తునకు తాత్కలిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి ఆస్తులు జప్తు చేశారు.పద్మ, ఆమె కుటుంబసభ్యుల పేరు మీదున్న 8.55 కోట్ల రూపాయల ఆస్తులు.. నాగలక్ష్మీకి చెందిన 2.72 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేయనున్నారు.

* టాలీవుడ్ లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే చాలు అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వు. ప‌వ‌న్ త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుస‌గా మూడు ప్రాజెక్టుల అప్ డేట్స్ ను ప్ర‌క‌టించాడు. తాజాగా ప‌వ‌న్ కు సంబంధించిన మ‌రో హాట్ న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ కోసం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి పెన్ను, పేప‌ర్ పట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. త‌మిళంలో హిట్ గా నిలిచిన అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే హీరోల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన‌డంతో ప‌వ‌న్ పేరును ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

* ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న‌కు మ‌రోసారి కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఇన్నాళ్ల‌ అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న బాగా నీర‌సించిపోయార‌ని, అందుకే చికిత్స అందిస్తున్నామ‌ని ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్న‌ట్లు ఎస్పీ బాలు త‌న‌యుడు చ‌ర‌ణ్ చెప్పారు.

* అమెరికన్లను కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడే వ్యాక్సిన్ అక్టోబర్‌లోనే అందుబాటులోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను నమ్మలేమని డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్‌ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ట్రంప్‌ చెప్పినట్టుగానే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్ధ్యం, భద్రతలపై ఆమె సందేహం వ్యక్తం చేశారు.

* తన ఫోన్‌ను ఓ దుకాణంలో పోగొట్టుకున్న వ్యక్తికి.. దానిని దొంగిలించిన వ్యక్తే తిరిగి ఇచ్చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అయితే తిరిగివ్వడానికి కారణం తనకు ఆ ఫోన్‌ను వాడటం రాకపోవటమే అని ఆ దొంగ పేర్కొనటం విచిత్రం. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు బుద్వాన్‌ జిల్లా, జమాల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 45,000 విలువ చేసే తన ఫోన్‌ను ఓ మిఠాయి దుకాణంలో పోగొట్టుకున్నాడు. వెంటనే తన నంబరుకు కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అయినట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

* క్రికెట్‌లో సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్లుగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు. వైకాపా నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుకోవాలే తప్ప అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చెయ్యొద్దని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అనంతపురంలో వార్డు సచివాలయ భవనాలకు ప్రభుత్వం అద్దెకట్టలేదని యజమానులు తాళాలు వేసి ఉద్యోగులను రోడ్డు మీదకు నెడుతున్నారు. భవనాలకు అద్దెకట్టడటం చేతకాని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా?ముఖ్యమంత్రి జగన్‌కి బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఇలా మూడు చోట్ల మూడు ఇళ్లు ఉన్నాయనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? లేక, వైకాపా జెండాకు మూడు రంగులు ఉన్నాయి కాబట్టి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా?’’ అని వైకాపా ప్రభుత్వాన్ని అనగాని ప్రశ్నించారు.

* అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశాన్ని బట్టబయలు చేశాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయన్నారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామని బెదిరిస్తున్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై అమరావతి రైతులు హైకోర్టులో అదనపు అపిడవిట్‌ దాఖలు చేస్తే మంచిదని రఘురామకృష్ణరాజు సూచించారు.