* బ్యాంక్ అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఇకపై చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్తే చెల్లింపులతో పాటుగా అదనపు రుసుము కూడా వసూలు చేయబోతున్నారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దేశం డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంకుల్లో రద్దీని తగ్గించేందుకు డిజిటల్ చెల్లింపులు ఉపయోగ పడుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల లోన్ల చెల్లింపులు, ఇతర చెల్లింపుల కోసం బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేందుకు ఐసిఐసిఐ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ చెల్లింపులు కాకుండా బ్యాంకుకు క్యాష్ రూపంలో చెల్లింపులు చెల్లిస్తే అదనంగా రూ.100 చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం. ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ విధానంపై మిగతా బ్యాంకులు కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
* దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్ల అండతో రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లూ రాణించడమూ కలిసొచ్చింది. మార్కెట్ల లాభాల్లో సింహ భాగం రిలయన్స్‌దే కావడం గమనార్హం. రిలయన్స్ రిటైల్ విభాగంలో సిల్వర్ లేక్ వాటాలు కొనుగోలు వార్తలు రిలయన్స్ షేర్ల దూకుడు కారణమైంది.
* ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగమైన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (పీఎంఏవై- సీఎల్‌ఎస్‌ఎస్) కింద 42,500 మంది లబ్ధిదారులకు సుమారు రూ.7,000 కోట్ల రుణాల మంజూరుకు ఆమోదం తెలిపామని ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ 42,500 మంది.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, తక్కువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాలకు చెందిన వాళ్లు. వీళ్లకు మంజూరు చేస్తున్న ఈ రుణాల కింద రూ.1,000 కోట్లకు పైగా సబ్సిడీ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రూ.1000 కోట్లలో రూ.870 కోట్ల సబ్సిడీని ఆర్థిక వెనకబడిన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు ఇచ్చామని తెలిపింది. కంపెనీ అందించిన మొత్తం సబ్సిడీల్లో ఈ విలువ 87 శాతమని తెలిపింది. ‘అందరికీ గృహవసతి’ని కల్పించాలనే ఉద్దేశంతో పీఎంఏవై- సీఎల్‌ఎస్‌ఎస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
* ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఏం చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది. తొలి ఐఫోన్ నుంచి అత్యాధునిక స్మార్ట్ ఫోన్ వెరైటీల వరకు ఈ సంస్థ తనదైన ముద్రను చాటుకుంటూనే ఉంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించేందుకు నిరంతరం ప్రయత్నించే యాపిల్.. ఈసారి నీటిపై తేలియాడే రిటైల్ స్టోర్‌ను రూపొందించింది. ‘‘మరింత సజీవంగా కనిపించే యాపిల్ మెరీనా బే సాండ్స్‌ను ప్రారంభించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎంజాయ్ ద వ్యూ..’’ అని సంస్థ ప్రకటించింది. సింగపూర్‌లోని మెరీనా బే ప్రాంతంలో ఇటీవలే ప్రారంభమైన ఈ నిర్మాణం ..ఇవాళ్టి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని నిర్మాణం, ఆకృతి, అంతర్గత నిర్మాణాలు అన్నీ అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి. చుట్టూ నీరు, మధ్యలో భవనం ఉండేలా కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటికి భిన్నంగా నీటిలోనే తేలియాడటడం ఈ భవనం ప్రత్యేకత.
* నిన్న నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయస్టాక్‌మార్కెట్లు నేడు లాభాల బాట పడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 38,481 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ కూడా 76 పాయింట్లతో 11,354 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలరులో రూపాయి మారకం విలువ 73.53గా ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ తదితర షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టగా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
* కియోస్క్ వ్యాపార పద్ధతి ద్వారా యువ వ్యాపారవేత్తలకు నెస్లే ఇండియా చేయూతను అందించనుంది. ‘నెస్లే నీడ్స్ యూత్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలకు మెళకువలను అందించడంతో పాటు కియోస్క్ వ్యాపార పద్ధతి ద్వారా అవకాశాలను కల్పించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ సమయంలో దేశంలోని యువతకు చేయూతను అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ యూత్ ఇనీషియేటివ్‌ను ప్రకటించడం ద్వారా దేశంలోని యువతకు చేయూతను అందించడంపై మాకున్న నిబద్దతను మరోసారీ తెలియజేశామ’ని నెస్లే ఇండియా పేర్కొంది.