శాసనసభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది. మునుగోడు, చండూరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దని.. ప్రభుత్వం చేయగలిగినవే చెప్పాలన్నారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే కాదని రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు, నియోజకవర్గాలు ఉన్నాయని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా ఠంచనుగా రూ.148 కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లుగా తామేమీ అభివృద్ధి చేయకుంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 130 మున్సిపాలిటీల్లో 122 స్థానాలను తెరాస గెలుస్తుందా? అని ప్రశ్నించారు. సత్యదూరమైన మాటలు మాని.. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని రాజగోపాల్‌రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. శాసనసభ జీరో అవర్‌లో మైక్ ఇచ్చినా హీరోగిరీ చేస్తామంటే అది మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
మైక్ ముంగట హీరోగిరి వద్దు
Related tags :