Business

అమెజాన్ చేతికి రిలయన్స్‌లో భారీ వాటా

భారతదేశంలో రిలయన్స్ మోనోపొలీ

భారతీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌తో చేతులు కలిపేందుకు రంగం సిద్ధమవుతోంది. తమ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్‌) సుమారు 20 బిలియన్ డాలర్ల వాటాను అమెజాన్‌కు విక్రయించేందుకు రిలయన్స్‌ సిద్ధమైంది. ఈ విషయమై ఆ సంస్థతో జరుపుతున్న చర్చలు విజయవంతమైతే.. ఆర్‌ఆర్‌వీఎల్‌లో సుమారు 40 శాతం వాటా అమెజాన్‌ సొంతమవుతుంది. భారత్‌లో రిటైల్‌ వ్యాపారం విలువ 1 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నప్పటికీ.. ఇందులో ఆన్‌లైన్‌ విక్రయాల వాటా తక్కువగానే ఉంది. ఇప్పటికీ అత్యధిక ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను వీధి చివరి దుకాణాల నుంచే కొనుగోలు చేసే భారత్‌ వంటి దేశాల్లో.. తనకు స్థానికంగా ఓ బలమైన భాగస్వామి కావాల్సిన అవసరాన్ని అమెజాన్‌ గుర్తించింది. అదే విధంగా చైనా ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు దీటుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న తన ఆశయాలకు అనుగుణంగా ముకేశ్‌ పావులు కదుపుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌తో రూ.7500 కోట్ల భారీ ఒప్పందం అనంతరం.. ఆయన రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరుగుతున్న చర్చలు సఫలమైతే.. రూ.14వేల కోట్లకు పైబడి విలువగల ఈ ఒప్పందం భారతదేశ చరిత్రలో, అదే విధంగా అమెజాన్‌కు సంబంధించి కూడా అతి ఖరీదైనది కానుంది.