* కరోనా వేళ భౌతిక దూరం పాటించాలన్న సూచనలను గాలికొదిలేసి మీడియా ప్రతినిధులు చూపిన అత్యుత్సాహంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆగ్రహం వ్యక్తంచేసింది. బాలీవుడ్ నటి కంగన ముంబయికి వచ్చే క్రమంలో విమానంలో ఆమె ఫొటోలు, వీడియోలు తీసిన దృశ్యాలు దృష్టికి రావడంపై మండిపడింది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి నివేదిక కోరింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ నెల 9న (బుధవారం) కంగన ముంబయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చండీగఢ్ నుంచి ముంబయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే, ఆ విమానంలో మీడియా ప్రతినిధులు ఆమె ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ క్రమంలో కొవిడ్-19 నిబంధనలు కనీసం పాటించకుండా పక్కపక్కనే నిల్చోవడం తమకు వీడియోల్లో కనిపించిందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇండిగోను నివేదిక కోరామని డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. అదే విమానంలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ప్రయాణం చేశారని మరో అధికారి తెలిపారు.
* శాసనసభ వేదికగా కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వివక్షతో కాకుండా విచక్షణతో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీదికి నెట్టడం సరికాదన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. సచివాలయం కూల్చివేతపై పెట్టిన శ్రద్ధ.. కరోనా నివారణపై పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. మజ్లిస్ మెప్పు కోసం ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. పారాసిటమాల్‌తో కరోనా పోతుందని మాట్లాడిన కేసీఆర్‌కి కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
* తాను రోజూ గో మూత్రం తాగుతానని బాలీవుడ్ యాక్షన్ చిత్రాల కథానాయకుడు అక్షయ్‌కుమార్ అన్నారు. ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ఆయన సాహసాలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ ఎపిసోడ్ డిస్కవరీ ప్లస్ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్షయ్ నటి హ్యుమా ఖురేషి, బేర్ గ్రిల్స్‌తో కలిసి మాట్లాడిన వీడియోను తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘ఏనుగు టీ’ తాగడానికి అక్షయ్ ఎలా ఒప్పుకున్నారని హ్యుమా ప్రశ్నించింది. దీనికి అక్షయ్ స్పందిస్తూ, ‘ఏనుగు టీ తాగడానికి నేనేమీ కంగారు పడలేదు. ఎందుకంటే ఆయుర్వేదం తెలిపిన ప్రకారం నేను రోజూ గో మూత్రం తాగుతా. కాబట్టి నాకు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. గోమూత్రం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి’ అని సమాధానం ఇచ్చారు. అక్షయ్ గోమూత్రం తాగడం గురించి చెప్పడంతో దానివల్ల కలిగే లాభాల గురించి ఆయన అభిమానులు వేలమంది గూగుల్‌లో శోధించారు.
* సకల మానవాళి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు కలిగిన గొప్ప వ్యక్తులు ఆచార్య వినోబాభావే, స్వామి వివేకానంద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వినోబాభావే జయంతి సహా వివేకానందుడు అమెరికాలోని చికాగోలో 1893వ సంవత్సరంలో ఇదే రోజు ప్రసంగించిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి గురించి మోదీ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.
* బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మృతి కేసు విచారణతో బీటౌన్‌లో మాదకద్రవ్యాల వాడకం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌కు చెందిన 99శాతం మంది నటులు డ్రగ్స్ వాడుతుంటారని ఇటీవల కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటుడు రాహుల్ దేవ్ స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినీ పరిశ్రమ గురించి ప్రజలు తప్పుగా మాట్లాడుకోవడం చూస్తే ఎంతో బాధగా ఉందన్నారు.
* తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వార్తల్లోకెక్కారు. కరోనా వైరస్ ఎప్పుడో వెళ్లిపోయిందని, కేవలం భాజపా ర్యాలీలను అడ్డుకునేందుకే మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు వేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు (టీఎంసీ), పోలీసులపై ప్రతీకారానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హూగ్లీ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
* పాఠశాలల్లో బోధన భాషపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని స్పష్టం చేశారు. మార్కుల జాబితానే విద్యార్థులకు ‘ప్రెజర్ షీట్’, తల్లిదండ్రులకు ‘ప్రెస్టేజ్ షీట్’గా మారిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.
* మహారాష్ట్ర ప్రభుత్వం – కంగన మధ్య నెలకొన్న మాటల యుద్ధంపై మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాపై కాకుండా కంగనాపై యుద్ధం చేస్తోందన్నారు. అక్రమ కట్టడమని పేర్కొంటూ ముంబయిలోని కంగన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేయడంపై మండిపడ్డారు. కంగన ఇంటిని కూల్చారు.. మరి దావూద్ నివాసాన్ని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.
* గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్ డిమాండ్‌ను పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. అయితే జాదవ్ తరఫు న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ఇటీవలే పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
* ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 14 నుంచి వర్షాకాల సమావేశాల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉభయసభల్లో కలిసి మొత్తం 785 మంది సభ్యులకు గానూ 200 మంది 65 సంవత్సరాలకు పైబడిన వారే. ఇప్పటివరకు ఏడుగురు కేంద్ర మంత్రులు, 24 మంది ఎంపీలు కరోనా బారినపడ్డారు. కొందరికి నయం కాగా.. మరికొందరు వైరస్ నుంచి కోలుకుంటున్నారు. వారంతా సమావేశాలకు హాజరవుతారని కచ్చితంగా చెప్పలేం.
* మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే బాధగా అనిపించడం లేదా అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని నటి కంగనా రనౌత్ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు కంగన తన ట్విటర్ వేదికగా సోనియాగాంధీని ఉద్దేశిస్తూ పలు ట్వీట్లు చేశారు.
* ప్రభుత్వం శాసనసభలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులో రికార్డింగ్ అథారిటీని ప్రస్తావించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్ అంశాలని స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభలో నూతన రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో శ్రీధర్‌బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. జాగీర్ అనే పదానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదని.. జాగీర్ భూముల అంశాన్ని పరిశీలించాలని శ్రీధర్‌బాబు కోరారు. పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలు ఉంటే ఎవరు సరిచేయాలనేదానిపై బిల్లులో స్పష్టత ఇవ్వలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రతి అంశంలోనూ స్పష్టత ఇస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16వేల కేసులు ఉన్నాయని.. ప్రతి వెయ్యి కేసుల పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇప్పటి వరకు తహసీల్దార్, ఆర్డీవో దగ్గర నమోదు కాని అనేక రికార్డులు ఉన్నాయని.. వాటిపైనా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు.
* ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం దిల్లీలో దీక్ష చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తన నివాసంలో దీక్ష చేపట్టారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, అమరావతి ఐకాస కన్వీనర్ జీవీఆర్ శాస్త్రి.. రఘురామకృష్ణరాజు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఏడాదిలో దాదాపు 15 ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక కుట్రను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.