* కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో వ్యాపారం లేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న థియేటర్ యజమానులు థియేటర్ల పునఃప్రారంభానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం అక్టోబర్‌లో దసరానాటికైనా తమ వ్యాపారంసాగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశంలోని థియేటర్ యజమానులు దసరాకి ముందు థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు ప్రాంతాల్లోని ఫిల్మ్ ట్రేడ్ సభ్యులు, సినిమా, మల్టీప్లెక్స్ యజమానులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కలిసారు. వారిచ్చిన హామీ మేరకు రానున్న రెండు రోజుల్లో మంచి వార్త తమ చెవిన పడుతుందని ఆశిస్తున్నారు.
* అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పతనమవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. గత నెలలో బంగారం ధరలు రికార్డుస్ధాయిలో 56,200 రూపాయల ఆల్‌టైం హైకి చేరిన తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనై 5000 రూపాయల వరకూ తగ్గుముఖం పట్టాయి. ఇక ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 285 రూపాయలు తగ్గి 51,489 రూపాయలకు తగ్గింది. కిలో వెండి ఏకంగా 1019 రూపాయలు పతనమై 67,972 రూపాయలకు దిగివచ్చింది.
* కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పూర్తయిన ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. అయితే కంపెనీలు మాత్రం ఫ్రేషర్స్ బయపడాల్సిన అవసరం లేదని, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీలు నిర్వహించనున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సాంకేతికతను ఉపయోగించనున్నారు. కాగా ప్రస్తుతం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే సందర్భంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విద్యార్థి వ్యక్తిత్వాన్ని పసిగట్టనున్నారు. టీమ్‌తో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు.
* మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. కాగా.. క్విప్ ముగిసిన నేపథ్యంలో యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేరు నష్టాలతో డీలాపడగా.. ఫాస్ట్‌ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాభాలతో సందడి చేస్తోంది.