Editorials

జీవుల పుట్టుపూర్వోత్తరాల వైపుకు డార్విన్‌-ఇన్నయ్య ముచ్చట్లు

జీవుల పుట్టుపూర్వోత్తరాల వైపుకు డార్విన్‌-ఇన్నయ్య ముచ్చట్లు

డార్విన్
2 వ భాగం
జీవుల పుట్టుపూర్వోత్తరాల వైపుకు – డార్విన్‌

బీగల్‌ నౌకలో ఐదేళ్ళు ప్రపంచ పరిశోధన యాత్ర నుండి తిరిగివచ్చిన చార్లస్‌ డార్విన్‌ వెంటనే తన అనుభవాలు రాయలేదు. యవ్వనంలోవున్న డార్విన్‌ ముందుగా పెళ్ళి చేసుకున్నాడు. లండన్‌లో నివాసం వుంటూ క్రమేణా దక్షిణాన ప్రశాంతంగావుండే చోటుకు మారి, ఇల్లు కొనుక్కుని మంచి తోట పెంచాడు. ఆలోగా డార్విన్‌ సేకరించినవన్నీ ఒకచోటకు చేర్చాడు. పరిశోధనా సంస్థలతో సంబంధం పెట్టుకున్నాడు. వివిధ అంశాలపై ప్రామాణిక పత్రికలకు రాయడం, ప్రసంగించడం పరిమితంగా మొదలైంది. అనేక అంశాలపై డార్విన్‌ తనదృష్టి సారించాడు. సంతానం కలిగింది. లండన్‌లో బిజీగా వుండే స్థలం మారి, గ్రామ వాతావరణంలో స్థిరపడి, పెద్దతోట పెంచి, పరిశోధనలు ప్రారంభించాడు.
అడప దడపా డార్విన్‌ తన పరిశోధనా అంశాలను సమాజానికి అందజేస్తూ పోయాడు. డార్విన్‌ పరిశోధనపై మెల్లగా చర్చలు ఆరంభమయ్యాయి. బీగల్‌ ఓడ నుండే ఇంగ్లండ్‌కు కొంతమేరకు సేకరణ అంశాలు పంపిన వాటిపై లండన్‌లో నెమ్మదిగా చర్చలు సాగాయి. జీవశాస్త్రం, ప్రకృతి విషయాలపై డార్విన్‌ పరిశీలనలు పట్టించుకోవడం మొదలైంది.
అయితే జీవపరిణామం, మానవ పరిణామం గురించి, డార్విన్‌ తొందరపడి రాయలేదు. పరిశోధనలు చేస్తూపోయాడు. డార్విన్‌ చర్చలు, అతడిపై ప్రసంగాలు సమాజదృష్టికి మెల్లగా రావడం ఆరంభమైంది.
డార్విన్‌కు కలిసివచ్చిన అంశం ఏమంటే, అతని సేకరణ గురించి, పరిశీలనల గురించి వ్యాఖ్యానించి సమర్ధించే వ్యక్తి లభించడం అరుదైన అంశం. అతడే హక్సలీ. విమర్శకులపై విరుచుపడి సమాధానాలు చెప్పే హక్సలీ ఆనాడు డార్విన్‌కు పెద్ద కవచం. అలా కొన్నాళ్ళు ఇంగ్లండ్‌ సమాజంలో జరిగిపోయింది.
ఈలోగా వాలేస్‌ అనే సైంటిస్ట్‌ మలేసియా ప్రాంతాలలో పరిణామాన్ని గురించి విషయసేకరణ చేస్తూ, విషయాలు నెమ్మదిగా బయటపెడుతూపోయాడు. అతడు డార్విన్‌తో సంబంధాలు పెట్టుకొని, తన పరిశోధనలు తెలియపరుస్తూవచ్చాడు. అదొక పెద్ద విశేషం. బీగల్‌ ఓడ యాత్రలో డార్విన్‌ సేకరించి, అభిప్రాయపడిన వాటిని పోలినవే వాలేస్‌ కూడా పేర్కొన్నాడు. అంతటితో వారిరువురి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే తన పరిశోధనా ఫలితాలను వెల్లడించే ధోరణిలో డార్విన్‌ ముందడుగు వేశాడు.
డార్విన్‌, వాలేస్‌ శాస్త్రజ్ఞులు పరిణామం గురించి సూచనప్రాయంగా వెల్లడిస్తూపోయారు. దానిపై రభస కూడా ఆరంభమైంది. అయితే డార్విన్‌ చర్చలలో అంత నిపుణుడు కాడు. ఆయన పక్షాన హక్సలీ సభలలో మాట్లాడి రాణించాడు. ఒక్కటొక్కటిగా డార్విన్‌ ప్రతిపాదనలు బయటపడుతూపోయాయి.
పరిణామం గురించి డార్విన్‌ రాయడానికి ఆయన ఆరోగ్యం తరచు అడ్డుపడింది. అది అధిగమించి ఎట్టకేలకు 1856 లో జీవుల పుట్టుపూర్వోత్తరాలు రాశాడు. 1859 నవంబరులో ప్రథమ ప్రచురణ తెచ్చాడు. అదే ప్రపంచదృష్టిని ఆకర్షించింది. క్రైస్తవులు, ఇతర మతాలవారు లబలబ కొట్టుకున్నారు. దైవానికి చోటులేకుండా పోతుందని భయపడ్డారు.
జీవుల పుట్టుపూర్వోత్తరాలు డార్విన్‌ రచనలలో మకుటాయమానమైనది. ప్రథమ ప్రచురణ 1250 ప్రతులు వేస్తే పప్పుబెల్లాలు వలె అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ప్రచురణలు వెలువడ్డాయి. డార్విన్‌ సజీవంగా వుండగా ఎన్నో ఎడిషన్లు వచ్చాయి. ఎంతో చర్చ జరిగింది. ఆలోచనారంగాన్ని కదిలించివేసింది. యూరోప్‌లోని అన్ని భాషలవారూ దీనిని అనువాదం చేసి తమ ప్రజలకు అందించారు.
రాను రాను యూరోప్‌ సరిహద్దులు దాటి అన్ని భాషల్లోకి జీవుల పుట్టుపూర్వోత్తరాలు కాపీలు విస్తరించాయి. జీవుల పుట్టుపూర్వోత్తరాలు రాకముందు, అందలి సారాంశాన్ని ప్రపంచానికి చాటడం వలన ఎప్పుడా అని ఎదురుచూచి మరీ అందుకున్నారు.
జీవుల పరిణామం సరే ! మానవుల సంగతేమిటి? దానికే, మానవ ఆవిర్భావం పేరిట 1871లో డార్విన్‌ తన రచన బయటపెట్టాడు. జంతువులు, తదితర జీవజాలం వలె మానవులు కూడా పరిణమించారు. జీవులన్నీ మార్పుచెందుతూ పరిణమిస్తూ పోయాయి. అదే మానవులకూ చెందుతుంది. జీవుల పుట్టుపూర్వోత్తర పరిణామం రాసినప్పుడు, మానవులు అందులో లేరనేలోటు తీరింది. మానవులకూ అదే సూత్రం వర్తిస్తుంది. మానవుల ఆవిర్భావం రాయడానికి డార్విన్‌కు మూడేళ్ళు పట్టింది. అది తృప్తినిచ్చింది. మానవులలో ఉద్వేగాల గురించి వివరంగా విపులీకరించాడు.
జంతుజాలం యావత్తూ సూక్ష్మజీవుల నుండి ఏనుగుల వరకూ అన్నీ పరిణామక్రమం లోనివే. సృష్టి అంటూ ఏ జీవికీ లేదు. ఈ పరిణామం జరుగుతూనే ఉంటుంది. అదే పరిణామ సత్యం.

నరిశెట్టి ఇన్నయ్య