ఫేస్‌బుక్‌ను కేంద్రంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో కాస్త పలుకుబడి, హోదా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిపేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. భద్రతలేని ఖాతాలను గుర్తించి అందులో ఉన్న ఫోటోలను డౌన్‌లోడ్ చేస్తున్నారు. అనంతరం వాటిని ఉపయోగించి అదే పేరుతో నకిలీఖాతాను తెరుస్తున్నారు. వీటి ఆధారంగా ఆ ఖాతాలో అప్పటికే ఉంటున్న స్నేహితులకు మళ్లీ ఫ్రెండ్ రిక్వెస్టులను పంపిస్తున్నారు. వీటిని చూస్తున్న స్నేహితులు కొన్ని అనివార్య కారణాలతో మరో ఖాతా తెరచి ఉంటాడని భావించి ఆ రిక్వెస్టులను అంగీకరిస్తున్నారు. అనంతరం చాట్ చేస్తూ.. ఎదుటివారికి నమ్మకం కలిగిస్తున్నారు. అనంతరం తనకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఇప్పటి వరకు రెండు ఫిర్యాదులు అందాయి. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు ప్రజలపై ఉన్న నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఖాతాలో ఉన్న వారికి మళ్లీ రిక్వెస్టులు పంపిన నేరగాళ్లు.. వాటిని అంగీకరించగానే వీరి పని మొదలు పెడుతున్నారు. మొదటగా కొన్ని రోజులు చాట్ చేస్తున్నారు. సదరు స్నేహితుడ్ని కుశల ప్రశ్నలు అడగడంతో పాటు.. తన పనితీరు ఎలా ఉందని అడుగుతున్నారు. తియ్యని మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంతపెద్ద అధికారి తనతో ఈ విధంగా మాట్లాడుతుండటంతో వారి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతోంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరం పడిందని, ఇప్పుడు ఇస్తే కొన్ని గంటల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు. వెంటనే తనకు సంబంధించి ఈ-వ్యాలెట్‌ల నంబర్లను పంపించి.. సదరు ఖాతాకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కువ మొత్తం అయితే అసలుకే మోసం వస్తుందని భావించిన నేరగాళ్లు.. తక్కువ మొత్తాలను డిమాండ్ చేస్తున్నారు. కేవలం రూ.5వేల నుంచి రూ.10 వరకు అడుగుతున్నారు. అంతపెద్ద అధికారి డబ్బు సర్దుబాటు కాకపోవడంతోనే అడుగుతున్నారనే భావన ఎదుటివారిలో కల్పిస్తున్నారు.