Devotional

తిరుమలలో పాత సాంప్రదాయంలోకి జగన్

తిరుమలలో పాత సాంప్రదాయంలోకి జగన్

రాష్ట్రంలో మత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటల్లో దగ్ధమైన తరువాత.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతానికి సంబంధించిన విమర్శలు, రాజకీయ దాడులను ఎదుర్కొంటోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అంతర్వేది ఘటనపై ఘాటు విమర్శలను సంధిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీలోనూ దీనిపై అసమ్మతి గళం వినిపించింది.. పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో. అంతర్వేది ఘటనను హిందుత్వంపై జరుగుతోన్న దాడిగా అభివర్ణిస్తున్నారు.

చంద్రబాబు, వైఎస్సార్‌లను కాదని..

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో కనుమరుగైపోయిందని భావిస్తోన్న పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు చేసిన విజ్ఙప్తిని ఆయన అంగీకరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించే విషయంలో పాత సంప్రదాయాన్ని అనుసరించడానికి వైఎస్ జగన్ ఓకే చెప్పారు. ఇదివరకు- చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విధానాన్ని జగన్ పక్కన పెట్టారు.

పాతసంప్రదాయం ప్రకారమే..

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి- గరుడ సేవ నాడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. 2003 నాటి బ్రహ్మోత్సవాలకు ముందు చంద్రబాబు సహా అందరు ముఖ్యమంత్రులూ గరుడ వాహనం నాడే ఏడుకొండలవాడికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. 2003లో ఈ విధనానికి బ్రేక్ పడింది. దీనికి కారణం- అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేయడమే.

గరుడసేవ నాడు కొండకు వెళ్తూ..

2003 అక్టోబర్ 1వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి చంద్రబాబు తిరుమలకు వెళ్తోన్న సమయంలోనే ఆయనపై నక్సలైట్లు దాడి చేశారు. క్లెమోర్ మైన్స్ పేల్చి, హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో చంద్రబాబు గాయపడ్డారు. ఈ ఘటన తరువాత.. గరుడసేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే తేదీలో మార్పు చోటు చేసుకుంది. గరుడ వాహనం నాడు కాకుండా.. ధ్వజారోహణం నాడే స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు అదే సంప్రదాయాన్ని అనుసరించారు. గత ఏడాది వైఎస్ జగన్ కూడా దాన్ని కొనసాగించారు.

ఈ సారి దీనికి భిన్నంగా..

ఈ సారి దీనికి భిన్నంగా పాత సంప్రదాయం ప్రకారం.. గరుడసేవ నాడు వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, 23న ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. రెండురోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ లేకపోవడం వల్ల పాత సంప్రదాయం ప్రకారం.. గరుడవాహనం జరిగే 23వ తేదీ నాడే ఆయన జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని టీటీడీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి..

అదే రోజు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా తిరుమలకు రానున్నారు. స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహానికి ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తారు. వేద పారాయణం, నాద నీరాజనం, సుందరకాండ పారాయణం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16 నెలల వ్యవధిలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక నుంచి శ్రీవారిని దర్శించడానికి వచ్చే వీఐపీలు, అధికారులు, ఇతర ప్రముఖుల కోసం దీన్ని నిర్మించనుంది. ఈ అతిథిగృహం కోసం ఏపీ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది