Movies

నెలకి ₹10లక్షల ఖర్చు

నెలకి ₹10లక్షల ఖర్చు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన స్వస్థలం మనాలీ చేరుకున్నారు. అనేక వివాదాల మధ్య సెప్టెంబరు 9న ముంబయి వెళ్లిన ఆమె సోమవారం ఉదయం ఇల్లు చేరుకున్నారు. ఆమెకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక సెక్యూరిటీని తొలగించాలని సుప్రీం కోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప ట్వీట్‌ చేశారు. ‘ఒక్క మనిషికి నెల రోజులపాటు ‘వై ప్లస్‌’ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై రూ.10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగన హిమాచల్‌ ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కంగనకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా?’ అని పేర్కొన్నారు. దీనికి కంగన స్పందిస్తూ.. ‘బ్రిజేష్‌ జీ.. మీరు, నేను ఊహించుకుని చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అపాయం ఉందా?, లేదా? అనే విషయాన్ని విచారిస్తుంది. దాని ఆధారంగా నా సెక్యూరిటీ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతను పూర్తిగా తీసేయొచ్చు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు’ అని అన్నారు.