తరాలుగా కొనసాగుతున్న లింగవివక్షకు తల్లిదండ్రులు కూడా కారణం అంటున్నాయి పలు సర్వేలు. వారు చేసే చిన్న చిన్న పొరపాట్లు లింగవివక్ష దిశగా చిన్నారులను నడిపిస్తున్నాయని వాటి సారాంశం. పిల్లలు అందరినీ సమదృష్టితో చూడగలిగే పౌరులుగా తయారవ్వాలంటే ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి.
సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాటలకు ఎక్కువ ప్రభావితం అవుతుంటారు. ఆడపిల్లలను తక్కువగా, మగపిల్లలను కాస్త ఎక్కువగా చూస్తే.. బాల్యంలోనే వారిని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అనే ధోరణికి వాళ్లూ అలవాటుపడుతారు.
అబ్బాయిలు ఏడుస్తుంటే.. ‘ఆడపిల్లలా ఆ ఏడుపేంట్రా’ అని అనాలోచితంగా అనేస్తుంటారు. ఆ మాటతో అప్పుడా పసివాడు ఏడుపు మానేయొచ్చు. కానీ, ఆడపిల్లలపై వారికి ఒకరకమైన దురభిప్రాయం ఏర్పడవచ్చు.
అబ్బాయిలు బొమ్మలతో ఆడుకుంటుంటే
‘ఎప్పుడు చూసినా ఆడపిల్లలా బొమ్మలతో ఆటలూ నువ్వూనూ!’ అని చాలామంది మందలిస్తారు. కానీ, పదేపదే వినిపించే మాటలు పసిమనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. లింగవివక్ష అనే విషబీజాన్ని వారి మెదళ్లలో నాటుతాయి.
కాస్త హుషారుగా ఉండే అమ్మాయిలను అబ్బాయిలతో పోల్చడమూ సరికాదు. వేసుకునే దుస్తుల మొదలు నడక తీరు వరకు ‘అబ్బాయిలా ఆ వేషాలేంటి?’ అని మందలించిన ప్రతిసారీ.. అమ్మాయిలంటే ఇలా ఉండకూడదేమో అన్న అనుమానాలు వారిలో కలుగుతాయి. బాల్యం నుంచే వారిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతూ వస్తుంది.
పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించడంలో తప్పులేదు. కానీ, పోలిక చూపుతూ పులికేకలు పెట్టడం వల్ల రాబోయే తరం సైతం విష వలయంలో చిక్కుకుపోతుంది. పిల్లలను ముద్దు చేయడంతో పాటు బుద్ధిగా పెంచడమూ ముఖ్యమే. వారి సామర్థ్యాలను గుర్తించి, ప్రోత్సహించడం మరీ ముఖ్యం.
పిల్లల్లో లింగవివక్షకు తల్లిదండ్రులే కారణం
Related tags :