* కరోనా వైరస్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం మరింత మెరుగుపడినట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగైనట్లు ఎక్స్‌రేలో కనిపించిందన్నారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరఫిస్టులు ఆయనతో వ్యాయామాలు చేయిస్తున్నారని చరణ్ వివరించారు.
* మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీయే తమకు పెద్ద సూపర్‌స్టార్ అని, భాజపాకు మరే ఇతర స్టార్‌లూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బిహార్ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన బిహార్‌లోని కతియార్‌లో భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
* కోలీవుడ్ నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది. విశాల్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు ప్రసార మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఆయన త్వరలోనే భాజపా తీర్థం పుచ్చుకోనున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో విశాల్ మేనేజర్ హరికృష్ణన్ సదరు వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని, కాబట్టి ఎవరూ ఆ వార్తలను నమ్మవద్దని సూచించారు. హరికృష్ణన్ పెట్టిన ట్వీట్‌తో విశాల్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని అభిమానులకు స్పష్టత వచ్చింది.
* ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చినజీయర్ మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్ వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు మైహోం గ్రూపు ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.
* రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. జేడీయూకు చెందిన హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేపీ నడ్డా ప్రతిపాదించగా.. థావర్ చంద్ సమర్థించారు. యూపీఏ తరఫున అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్ ఝాపై ఆయన విజయం సాధించినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మూజువాణి ఓటింగ్ ద్వారా ఈ ఎన్నిక నిర్వహించారు.
* కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేవిధంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని శివబాలాజీ కోరారు.
* రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకుసాగుతున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేలా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలో కొత్త రోడ్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేంద్రం సహకరించడం లేదని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్ స్థాలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. ఏళ్లుగా అడుగుతున్నా వారి ఆలోచన సైతం చెప్పడం లేదని విమర్శించారు.
* రాజధాని రైతులపై ఏపీ ప్రభుత్వం వేధింపులు ఆపేలా చూడాలని అమరావతి ప్రాంతంలోని మందడం రైతులు, మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అవసరాల కోసం భూమి అమ్మినా సిట్, సీఐడీ, సబ్‌కమిటీ పేర్లతో తమను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. తమతో జరిగిన న్యాయబద్ధమైన ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని రైతులు ఆరోపించారు.
* వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)కు భయపడి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై కథానాయకుడు సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తెలిసిన తర్వాత తన గుండె పగిలిందని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధ ఊహిస్తేనే భయంగా ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ తీరును విమర్శించారు. ప్రజలు ‘నీట్’ను వ్యతిరేకించాలని అన్నారు.
* దేశంలో లాక్‌డౌన్ విధించడం వల్లే 14 లక్షల నుంచి 29లక్షల కరోనా వైరస్ కేసులు; 37వేల నుంచి 38వేల మరణాలను నియంత్రించగలిగామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడమనేది సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. వైరస్‌పై పోరాడటంలో యావత్ దేశం సమష్టిగా నిలబడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. సోమవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన ప్రకటన చేశారు.
* తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కొందరు సభ్యులు తమ సందేహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. మరికొందరు సూచనలు చేశారు. ఆ తర్వాత సభ్యుల సందేహాలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో వ్యవస్థ రద్దు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ తదితర బిల్లులకు శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.
* భారత్‌లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో దీన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠవాలే స్పందించారు. భారత్ కూడా చైనాపై ఓ కన్నేసి ఉంచిందని.. త్వరలోనే ఆ దేశానికి ఓ గుణపాఠం నేర్పుతామని వ్యాఖ్యానించారు.