Business

టీవీల ధరలు పెరుగుతాయి

టీవీల ధరలు పెరుగుతాయి

రాబోయే పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాకివ్వబోతున్నాయి టెలివిజన్‌ తయారీ సంస్థలు. వచ్చే నెలలో టీవీల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. అక్టోబర్‌లో ఒక్కో టీవీ ధర 20 నుంచి 35 శాతం పెరుగవచ్చన్న అంచనాలు పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్యానెళ్ల ధరలు పెరుగడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నాయి. గడిచిన కొద్దివారాల్లో ప్యానెల్‌ ధరలు 20 శాతం పెరిగాయని పరిశ్రమ గుర్తుచేస్తున్నది. టెలివిజన్‌ ధరలో దాదాపు 60 శాతం విలువ ఈ ప్యానెల్‌దే. టీవీ స్క్రీన్‌ తయారీలో ఈ ఓపెన్‌-సెల్‌ ప్యానెల్‌దే కీలకపాత్ర. అలాంటి ఈ ప్యానెళ్ల సరఫరాలో మందగమనం మార్కెట్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తున్నది. నిజానికి ఇప్పటికే ఈ ఏడాది టీవీ ధరలు 10 శాతం వరకు పెరిగాయి. చైనా నుంచి విడిభాగాల సరఫరాలో తలెత్తిన ఇబ్బందులే ప్రధాన కారణం.