* దేశంలో పుత్తడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మూడు రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మంగళవారం రోజున కూడా తగ్గాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గింది.అటు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.కిలో వెండి ధర రూ. 660 తగ్గింది.అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దీనికి ఒక కారణమైతే,కోవిడ్ తరువాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెప్తున్నారు.
* దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావడంతో పాటు అంతర్జాతీయంగానూ సానుకూల పరిణామాల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 288 పాయింట్లు లాభపడి, 39వేల మార్కును దాటింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,521 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.64 వద్ద కొనసాగుతోంది.
* భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించబోమని టయోటా మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. అధిక పన్నులు విధించడమే ఇందుకు కారణమని టయోటా ఇండియా వైస్ ఛైర్మన్ శేఖర్ విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించాలనుకుంటున్న భారత్‌కు ప్రస్తుత పన్నుల విధానం గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రభుత్వం కార్లు, ద్విచక్రవాహనాల కొనుగోళ్లపై అత్యధిక పన్నులు విధిస్తోందని, సదరు సంస్థలకు ఇది ఇబ్బందిగా పరిణమిస్తోందని తెలిపారు. భారత్‌లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరించడం కష్టమని ఆయన స్పష్టం చేశారు.
* కరోనా మహమ్మారి నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (ఆర్‌ఈ) తన బుల్లెట్ 350 BS6 మోడల్స్ ధరలను కాస్త పెంచింది. భారత విపణిలో బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో లభిస్తున్న విషయం తెలిసిందే. బుల్లెట్ X, స్టాండర్డ్ బ్లాక్, టాప్‌ఎండ్ ES(ఎలక్ట్రిక్ స్టార్ట్) వేరియంట్లలో బుల్లెట్ 350 వాహనం దొరుకుతుంది. ప్రతి వేరియంట్ ఎక్స్ షోరూం ధరపై రెండు శాతం వరకు పెంచుతున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. అంటే దాదాపు రూ.2,756 వరకు పెరిగే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ విభాగంలో బుల్లెట్ 350 ఎప్పటి నుంచో ఆదరణ పొందుతున్న మోడల్. ఇప్పుడు కొత్త రంగుల్లో వినియోగదారుల కోసం అందుబాటులోకి రాబోతుంది. భారత వాహన విపణిలో ఈ ధరల విభాగంలో బుల్లెట్ 350కి సరైన ప్రత్యర్థి లేదనే చెప్పొచ్చు. అలాగే అవతార్ మోడల్‌ను కూడా సరికొత్తగా తయారు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్స్ కొత్త ధరలు(దిల్లీ ఎక్స్ షోరూం) ఇలా ఉండొచ్చు. బుల్లెట్ x 350: రూ.1,27,093. బుల్లెట్ 350 (బ్లాక్): రూ.1,33,260. బుల్లెట్ X 350 ES (ELECREIC START): రూ. 1,42,705.