తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో తాటి చెట్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. తాటి నీరాతో తయారైన బెల్లానికి కూడా మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఎక్కువ ఎత్తు పెరిగే మన దగ్గరి తాటి జాతి కన్నా బీహార్‌కు చెందిన పొట్టి రకం తాటి చెట్ల పెంపకం మేలని పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూపరెడ్డి అంటున్నారు. తెలంగాణలో తాడి చెట్లు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. గింజ నాటిన 12–14 ఏళ్లకు గానీ గీతకు రావు. బీహార్ పొట్టి రకాలైతే 10–20 అడుగుల ఎత్తు పెరుగుతాయి. విత్తిన 5–7 ఏళ్లలోనే గీతకు వస్తాయని, సీజన్‌లో రోజుకు 3–15 లీటర్ల నీరా, వంద వరకు పండ్లను ఇస్తాయని తమిళనాడులోని తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు విష్ణుస్వరూప్‌రెడ్డి తెలిపారు. ఎత్తు తక్కువ ఉండటం వల్ల గీత కార్మికుల పని సులువు కావటంతోపాటు అభద్రత తగ్గుతుందన్నారు. బీహార్ పొట్టి రకం తాటి పండ్లను గత ఏడాది 5 వేలు తెప్పించి పంచామని, ఈ ఏడాది 1,25,000 వరకు తెప్పిస్తున్నానని అన్నారు. వీటిని హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా, రోజుకు 30 లీటర్ల నీరా దిగుబడినిచ్చే డాలర్ (జీలుగ/గిరిక తాడు) మొక్కలను తొలిసారిగా టిష్యూకల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని విష్ణుస్వరూప్‌రెడ్డి (95023 76010) వెల్లడించారు.
తెలంగాణాలో పొట్టి తాటిచెట్లకు మాంచి గిరాకీ
Related tags :