DailyDose

ఆ మూడు సింహాలను మాయం చేసింది ఎవరు?-తాజావార్తలు

Breaking News - Three Lions Missing From Durga Chariot

* డ్రగ్స్‌ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని మొత్తం చిత్రపరిశ్రమను తప్పుపట్టడం సరికాదంటూ మంగళవారం పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలతో నటి హేమామాలిని ఏకీభవించారు. బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ తనకెంతో ఇచ్చిందని.. అలాంటిది ఇప్పుడు దాని గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఊరుకోగలను అని ప్రశ్నించారు. ‘బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఎవరూ దెబ్బతీయలేరు. ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అది చిన్న విషయం మాత్రమే. ఇది బట్టలకి పట్టిన మురికి లాంటిది. కాబట్టి శుభ్రంగా కడిగివేయాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానాలు పొందాను. ఎవరైనా వ్యక్తులు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఉండగలను’ అని హేమామాలిని అన్నారు. ఇదిలాఉండగా తాప్సీ, సోనమ్‌ కపూర్‌, దియామీర్జాతోపాటు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు.. పార్లమెంట్‌ వేదికగా జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. జయాబచ్చన్‌ చక్కగా చెప్పారంటూ ట్వీట్లు చేశారు.

* మార్కెట్లో స్మార్ట్‌ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు యూజర్‌ ఫ్రెండ్లీ ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రోజువారీ ఉపకరణాలపై దృష్టి సారించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ఇటీవలే ఫిట్‌నెస్‌ బ్యాండ్, హోం సెక్యూరిటీ కెమెరాలను విడుదల చేసింది. తాజాగా స్మార్ట్‌ ప్లగ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో అలెక్సా ఎనేబుల్ స్మార్ట్‌ స్పీకర్‌ ఉంది. దాని ద్వారా వాయిస్‌ కమాండ్స్‌తో మొబైల్ ఛార్జర్‌, లైట్, కెటిల్‌, టీవీతోపాటు ఇతర ఉపకరణాలు ఆన్‌/ఆఫ్ చేయడంతో పాటు షెడ్యూల్ చేసుకోవచ్చు.

* భారత్‌- చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన తన తల్లి సోనియా గాంధీ వెంటే ఆయన కూడా ఉన్నారు. దాంతో ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారు. కానీ, తాజా పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పార్లమెంట్‌లో రక్షణ శాఖ, హోం మంత్రిత్వ శాఖ ప్రకటనల నేపథ్యంలో బుధవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

* సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ అబుదాబికి ఎందుకు వెళ్లాడు? ముంబయి ఇండియన్స్‌తో ఎందుకు కలిసి ఉంటున్నాడు? ఆటగాళ్లతో కలిసి ఎందుకు ఎంజాయ్‌ చేస్తున్నాడు? ముంబయి అతడితో ఒప్పందం కుదుర్చుకుందా? ఐపీఎల్‌-2020లో అతడు అరంగేట్రం చేస్తాడా? ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లతో కలిసి ఈత కొలనులో అర్జున్‌ కనిపించడంతో సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రశ్నలివి. అయితే ముంబయి యాజమాన్యం అతడితో ఇప్పటికీ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిసింది. నెట్‌బౌలర్‌గానే యూఏఈకి తీసుకెళ్లిందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. గతంలోనూ అతడు వాంఖడేలో ముంబయికి నెట్‌బౌలర్‌గా పనిచేశాడు. ఎడమ చేతివాటం పేసర్ కావడంతో అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడూ అదే ఉద్దేశంతో అర్జున్‌ను అక్కడికి పిలిపించారు.

* నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపింగ్‌ మాల్స్‌పై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించింది. అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ జరిమానాలు విధించారు. అమీర్‌పేటలోని చెన్నై షాపింగ్‌ మాల్‌కు రూ.4లక్షలు, వీఆర్కే సిల్క్స్‌కు రూ.2లక్షలు, ఎస్సార్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌కు రూ.1.50లక్షలు, రిలయన్స్‌ డిజిటల్‌కు రూ.లక్ష, లక్డీకపూల్‌లోని ఇంపీరియల్ రెస్టారెంట్‌కు రూ.లక్ష మేర జరిమానా విధించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించామని కేటీఆర్‌ చెప్పారు. అన్ని పురపాలికల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద ఎకో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2014 తర్వాత ఖమ్మం ఎలా మారిందో ప్రజలకు తెలుసన్నారు. లక్కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశామని.. భద్రకాళి ట్యాంకును అభివృద్ధి చేసిందెవరో ప్రజలకు తెలుసని చెప్పారు. బోధించు, సమీకరించు, పోరాడు అనేవి అంబేడ్కర్‌ నినాదాలని.. ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని కేటీఆర్‌ గుర్తు చేశారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించింది ఎవరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఏనాడూ పట్టించుకోలేదు..గౌరవించలేదన్నారు. ఆయన్ను ఓడించి పార్లమెంట్‌కు రాకుండా చేసింది కాంగ్రెస్సేనని కేటీఆర్‌ ఆరోపించారు. ఇప్పటికే బోరబండలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు.

* దుర్గమ్మ రథానికి ఉండే వెండి సింహాలు అదృశ్యం కావడానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయన్ని బర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమైన విషయం తెలిసిందే.

* విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమయ్యాయన్న విషయం బయటకురావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు భాజపా నేతలు దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

* ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో పాక్‌ చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మైనారిటీలను నిరంతరం అణచివేతకు గురిచేసే పాకిస్తాన్‌ మానవ హక్కులపై ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు సిద్ధంగా లేమని అంతర్జాతీయ వేదికపై భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని.. పలువురికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్టు ఆ దేశ ప్రధానమంత్రే స్వయంగా అంగీకరించారని తేల్చిచెప్పింది.

* గత ఆరునెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎటువంటి చొరబాట్లు చోటుచేసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. లద్దాఖ్ ప్రాంతంలో చైనా దళాల చొరబాట్లపై వస్తోన్న నివేదికలను తక్కువ చేసి చూపుతూ వాటిని ‘దురాక్రమణకు ప్రయత్నాలు’గా కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘ఆరు నెలల కాలంలో భారత్‌, చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు నమోదు కాలేదు’ అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.

* మిస్టరీగా మారిన క్రికెటర్‌ సురేష్‌ రైనా కుటుంబీకుల హత్య కేసు చిక్కుముడి వీడింది. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టుపై స్పందించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ కేసును పరిష్కరించినట్లు ప్రకటించారు. పంజాబ్‌ డీజీపీ దిన్‌కర్‌ గుప్తా మాట్లాడుతూ.. 11 మంది సభ్యులతో కూడిన అంతర్‌రాష్ట్ర ముఠా పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి పలు ఘటనలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు.

* చైనా వస్తువులపై అధిక సుంకాలు విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. 200 బిలియన్‌ డాలర్ల వస్తువులపై ట్రంప్‌ సర్కార్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ప్రకటించింది. వివిధ దేశాలపై ట్రంప్‌ విధిస్తున్న సుంకాలపై డబ్ల్యూటీవో అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలిగిన ట్రంప్‌ పలు సందర్భాల్లో డబ్ల్యూటీవోపైనా విమర్శలు గుప్పించారు.