NRI-NRT

ట్రంప్‌పై భారతీయుల కేసును కొట్టేసిన భారతీయ సంతతి జడ్జి

ట్రంప్‌పై భారతీయుల కేసును కొట్టేసిన భారతీయ సంతతి జడ్జి

హెచ్‌-1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకూ రద్దుచేసిన ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసిన భారతీయులకు అమెరికా న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశాలకు చెందిన ఉద్యోగులు అగ్రరాజ్యంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్‌-1బీ వీసాల జారీని నిలిపివేస్తూ.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్‌ 22న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా పౌరుల ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయానికి విదేశీ ఉద్యోగుల నుంచే కాకుండా అమెరికా సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. వీసా రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి కూడా సరిదిద్దుకోలేని హాని చేయగలదని దిగ్గజ సాంకేతిక సంస్థలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో వర్క్ వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన 169 మంది భారతీయులు, ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వీసా నిషేధాజ్ఞ ఏకపక్షమైనదని, నిలకడలేనిదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, వీసా ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్ధించారు. కాగా, ఈ కేసును విచారించిన యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి అమిత్‌ మెహతా ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. తమ వాదనను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను భారతీయ ఉద్యోగులు అందించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

వీసా రద్దు నిర్ణయం నిలిపివేతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి మెహతా తిరస్కరించడం ఇది రెండోసారి. తాజా కేసులోనే కాకుండా సెప్టెంబర్‌ 4న కూడా ఇదే తరహా కేసులో పిటిషనర్లు ట్రంప్‌ ప్రభుత్వం వీసాల రద్దు నిర్ణయంలో చట్ట పరిధిని దాటినట్టు నిరూపించలేకపోయారని ఆయన వెల్లడించారు. ఈ తీర్పుపై తమ అభిప్రాయం వెల్లడించనప్పటికీ.. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని భారతీయుల తరపు న్యాయవాదులు వెల్లడించారు.