Business

SBI OTP నిబంధన రోజంతా ఉంటుంది-వాణిజ్యం

SBI OTP నిబంధన రోజంతా ఉంటుంది-వాణిజ్యం

* ఓటీపీ ఆధారంగా రూ.10వేలు, అంతకుమించి నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని రోజంతా అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.ఈ సదుపాయం సెప్టెంబర్‌ 18 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.దీని ప్రకారం డెబిట్‌కార్డు కలిగినవారు ఏటీఎంకు వెళ్లి, రూ.10,000, అంతకు మించి ఉపసంహరించాలంటే, రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చే ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంది.అంటే డెబిట్‌ కార్డుతో పాటు బ్యాంకు వద్ద నమోదైన మొబైల్‌ కలిగి ఉంటేనే నగదు ఉపసంహరించే వీలుంటోంది.ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని కల్పించినప్పటి నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అమలవుతోంది.

* కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోవాలంటే ఐదేళ్ల సమయం పట్టొచ్చని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్‌ రీన్‌హర్ట్‌ అన్నారు. గురువారం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో పేదరికం శాతం పెరిగిందని అన్నారు. కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయని ఆమె సమావేశంలో వెల్లడించారు.

* భారత్‌ మార్కెట్‌ పట్ల తమకు పూర్తి నిబద్ధత ఉందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తెలిపింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా తాము పనిచేయనున్నామని పేర్కొంది. త్వరలో రూ.2వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని వెల్లడించింది. దేశంలో పన్నులు అధికంగా ఉన్నాయని, భవిష్యత్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించబోమన్న ఆ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

* వరుసగా రెండు రోజులు లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌‌ 140 పాయింట్లు కోల్పోయి 39168 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 11567 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా ఉంది. బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో -8.6 శాతంగా నమోదు కావొచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. అంతక్రితం అంచనా -5.8 శాతంగా ఉండగా.. సంక్షోభ సమయంలో ప్రభుత్వ స్పందన తదితరాలను పరిగణించి.. తాజా సవరణ చేసినట్లు చెప్పింది. భారత్‌ వృద్ధి సత్తాను సైతం 7.1 శాతం నుంచి 5.75-6.25 శాతానికి సవరించింది. వృద్ధి పతనం కాకుండా చేపట్టే చర్యల విషయంలో ప్రభుత్వం నుంచి బలహీన స్పందన కనిపించిందని ఆ సంస్థ అంటోంది. సెప్టెంబరు త్రైమాసికం తర్వాత గిరాకీ, ఆర్థిక రికవరీ కనిపించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కనిపిస్తున్న రికవరీ కొనసాగకపోవచ్చని పెరుగుతున్న కరోనా కేసులే అందుకు కారణమని యూబీఎస్‌ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్‌ పేర్కొన్నారు. అయితే 2021-22లో మాత్రం భారత వృద్ధి 10 శాతం మేర నమోదవుతుందని ఆమె అంచనా వేశారు. త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. సంస్కరణలు కూడా వాటికి జతకలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. మౌలికాభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు, ఉద్యోగ సృష్టిని కల్పించే మరిన్ని పనులను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని జైన్‌ అన్నారు.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రాబోయే మూడేళ్ల పాటు వడ్డీ రేట్లను సున్నాకు దరిదాపుల్లో ఉంచుతామన్న ప్రకటనతో పాటు మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండబోదన్న అమెరికా ఫెడ్‌ సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. ముఖ్యంగా బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది.