DailyDose

కరోనాతో మాదాపూర్ SI మృతి-TNI బులెటిన్

కరోనాతో మాదాపూర్ SI మృతి-TNI బులెటిన్

* కడప కేంద్రకారాగారంలొ కరోనాను జయించిన ఖైదీలు…గత నెల 360 మంది ఖైదీలకు కరోనా పాజిటీవ్…ఇప్పటి వరకు కోలుకున్నవారు 349 మంది…ఇంకా కోలుకుంటున్నవారు 11 మంది…జైలులోనే ప్రత్యేక గదుల్లొ ఉంచి చికిత్సనందించిన జైలు అదికారులు.

* రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనాపై పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి వైద్యులు, పోలీసు అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీస్‌ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

* తమిళ సినీ పరిశ్రమలో మరో మరణం చోటు చేసుకుంది. కరోనా తదితర సమస్యల కారణంగా ఇప్పటికే పరిశ్రమ పలువురు సినీ ప్రముఖులను కోల్పోయింది. తాజాగా దర్శకుడు బాబు శివన్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన వయసు 54 ఏళ్లు. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘వేట్టైక్కారన్’‌  చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ  నిర్మించిన ‘కురివి’ చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై  దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. కాలేయం, ఊపిరితిత్తులు  సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్‌ వైద్యం ఫలించక బుధవారం రాత్రి తుదిశ్వాస  విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి  గురైంది.  ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

* కరోనా వైరస్‌ను అతి తక్కువ సమయంలోనే నిర్ధారించే పరీక్షను లండన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలాంటి ప్రయోగశాల అవసరం కూడా లేకుండానే డీఎన్‌ఏనడ్జ్‌(DnaNudge)పరీక్ష ద్వారా కేవలం గంటన్నరలోనే కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు గుర్తించారు. తాజా పరీక్ష పరిశోధనా పత్రాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ప్రచురించింది.