* నేడు(సెప్టెంబరు 20 2020) ఆయన జయంతి
* 2012లో అమెరికాలో అక్కినేని షికార్లు
* ఘనంగా జన్మదిన వేడుకలు
* గిన్నిస్, మెడికల్ రికార్డులను అధిగమించిన అక్కినేని
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ముచ్చటగా 30వ సారి 2012 ఆగష్టు 18వ తేదీన అమెరికాలో ప్రవేశించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన అమెరికా దేశం అంటే అక్కినేనికి ఎనలేని అభిమానం. 1974లోనే చావుబతుకుల మధ్య ఉన్న అక్కినేనికి ఇక్కడ ఉన్న ప్రముఖ వైద్యులు ప్రాణదానం చేశారు. 1988 వరకు అక్కినేని ప్రాణాలకు ఢోకా లేదన్నారు. వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ నిండు నూరేళ్లు దాటడానికి అక్కినేని హుషారుగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్కినేని అమెరికాలో తనకు ఉన్న చిరకాల మిత్రులను, ప్రవాసాంధ్ర ప్రముఖులను, అభిమానులను కలుసుకుని కృతఙ్ఞతలు తెలపటం కోసం ౩౦వ సారి ఈ దేశంలోకి ప్రవేశించారు. న్యూయార్కు జాన్.ఎఫ్.కెనడీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుండి ఆయనలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది. అమెరికాలో ఉన్నంత కాలం ఆయన తీరిక లేకుండా అలసట ఎరగకుండా హుషారుగా గడిపారు. దాదాపు నెల రోజుల పాటు జరిపిన ఈ పర్యటన తనలో నూతన ఉత్సాహం నింపిందని అక్కినేని పలు సభల్లో వెల్లడించారు. న్యూయార్కు, న్యూజెర్సీ, డెట్రాయిట్, సెయింట్ లూయిస్, డల్లాస్, హ్యూస్టన్ నగరాల్లో అక్కినేని పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. 89 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, 89 మంది ప్రవాసాంధ్ర ప్రముఖులను అక్కినేని ఈ సందర్భంగా సత్కరించారు.
*** ప్రవాసాంధ్రులకు సన్మానం
న్యూయార్కుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అనుమోలు సుబ్బారావు, తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు దాము గేదెల, అక్కినేని అమెరికా పర్యటన సమన్వయకర్త కొండబోలు రవి, న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర, డెట్రాయిట్ లో డాక్టర్ తుమ్మల మాధవరావు, డాక్టర్ గంగాధరాన్, కె.సి.ప్రసాద్, ఈదర రాజన్, గారపాటి భవానీ ప్రసాద్, యక్కా వెంకట్, కంచర్ల రామకృష్ణ, పెద్దిబోయిన జోగేశ్వరరావులను, సెయింట్ లూయిస్ లో అఖిలా బలరాం, రంగనాధన్, మద్దసాని వెంకట రెడ్డి, పోలినేని సుబ్బారావులను, డల్లాస్‌లో డాక్టర్ సి.ఆర్.రావు, వింజమూరి అనసూయ దేవి, హ్యూస్టన్ భారత కాన్సుల్ జనరల్ పర్వతనేని హరీష్, జయ తాళ్ళూరి, రాజా తాళ్ళూరి, కొండ్రుగుంట చలపతి రావు, 19వ తానా మహాసభల కన్వీనర్ వెన్నం మురళి, తానా మాజీ కార్యదర్శి యలమంచిలి రాం, తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ళ గంగాధర్ తదితరులను అక్కినేని ఈ సందర్భంగా సత్కరించారు.
*** డల్లాస్‌లో జన్మదిన వేడుకలు
అక్కినేని 89 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డల్లాస్ లో తానా నిర్వహించిన వేడుకల్లో అక్కినేనిని గుర్రపు బగ్గీలో ఊరేగించారు. 40 మంది ప్రవాసాంధ్రులను సత్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నూరేళ్ళు జీవించాలని తాను కోరుకోవటం లేదని, ఉన్నంత కాలం సుఖ సంతోషాలతో ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని, ఇంత మంది అభిమానుల ఆశీర్వాదం వలనే తను జీవించి ఉన్నానని, మరో జన్మంటూ ఉంటే నటుడిగానే పుట్టి వారి ఋణం తీర్చుకుంటానని అక్కినేని పేర్కొన్నారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన అమెరికాను ఎన్నటికీ మరువలేనని, తనతో సినీరంగంలో ప్రవేశించిన మహానటులెందరో కనుమరుగు కావటం మీతో పాటు నాకు కూడా బాధగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు. చిరాయువుగా ఉన్న తనలో వారందరినీ చూసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సి.ఎం.రమేష్, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, నాటా, ఆటా, నాట్స్, టాంటెక్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డల్లాస్ లో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు 17 సంవత్సరాలకు మించి బతకరనే అభిప్రాయం ఉన్నాడని, ఈ అభిప్రాయాన్ని బద్దలు కొడుతూ 1974లో బైపాస్ సర్జరీ చేయించుకున్న అక్కినేని, 38 సంవత్సరాల పాటు మన మధ్యనే ఉంటూ గిన్నిస్ మెడికల్ రికార్డులను అధిగమించారని పేర్కొన్నారు. అక్కినేని జీవన విధానం ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఆసక్తిగా గమనిస్తున్నారని, ఆయన నూరేళ్ళు జీవిస్తారని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా తానా అక్కినేని చిత్రాన్ని ముద్రించిన 89 నాణేలను ఆయన చేతుల మీదుగా విడుదల చేసి, జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 19వ మహాసభల లోగోను కూడా అక్కినేని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అక్కినేని నాలుగు వారాల అమెరికా పర్యటన ముగించుకున్న అనంతరం సెప్టెంబరు 14 వ తేదీన హ్యూస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రవాసాంధ్రుల వీడ్కోలు మధ్య హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.