Sports

కరణం మల్లీశ్వరి రికార్డుకు 20ఏళ్లు

Karanam Malleswari Feat In 2000 Sydney Olympics Completes 20Years

కరణం మల్లీశ్వరి..దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్‌. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకుమిక్కిలి పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న లిఫ్టర్‌. అలవోకగా బరువులు ఎత్తుతూ ఆమె పతకాలు కొల్లగొట్టిన సందర్భాలు కోకొల్లలు. సిడ్నీ(2000) ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి కాంస్య పతకంతో చరిత్ర సృష్టించి శనివారానికి సరిగ్గా 20 ఏండ్లు. విశ్వక్రీడల్లో తొలి పతకం గెలిచిన భారతీయురాలిగా అరుదైన రికార్డును నెలకొల్పిన మల్లీశ్వరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ తెలుగు తేజం సోషల్‌ మీడియాలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తాను సాధించిన కాంస్య పతకం, పోడియంపై విజయదరహాసాన్ని ప్రదర్శించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. సిడ్నీ ఒలింపిక్స్‌ కంటే ముందు వేర్వేరు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణాలు సహా రెండు కాంస్య పతకాలు సాధించిన మల్లీశ్వరి..ఆసియా గేమ్స్‌లో రెండు రజత పతకాలతో మెరిసింది. ప్రతిభకు తగిన గుర్తింపుగా మల్లీశ్వరి..అర్జున(1994), ఖేల్త్న్ర(1999), పద్మశ్రీ(1999) అవార్డులు అందుకుంది. 2004లో వెయిట్‌లిఫ్టింగ్‌కు వీడ్కోలు పలికిన ఈ తెలుగు తేజం..తన పేరిట ఫౌండేషన్‌ను నెలకొల్పింది.