Devotional

సింహవాహనంపై యోగనారసింహుడిగా…

2020 TTD Salakatla Brahmotsavalu - Simhavahanam

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు.

*** సింహ వాహనం – ధైర్య‌సిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.