NRI-NRT

ట్రంప్‌పై రెజిన్ విషప్రయోగం

ట్రంప్‌పై రెజిన్ విషప్రయోగం

కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగానికి కుట్రలు పన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్‌కు విషంతో కూడిన ఓ పార్సిల్‌ను పంపారు. దీనిపై దేశ అత్యున్నత ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ)తో పాటు మరికొన్ని బృందాలు విచారణ చేపడుతున్నాయి. పార్సిల్‌లో ఉన్నది రిసిన్‌ అనే అత్యంత విషపూరితమైన పదార్థంగా గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పదార్థమని, దానిని స్పీకరించిన 36 నుంచి 72 గంటలలోపు మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంత వరకు విరుగుడు కనిపెట్టకపోవడం గమనార్హం. అయితే ఆ విషపు పార్సిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు వైట్‌హౌస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఇలాంటి విష పదార్థాలతో కూడిన పార్సిల్స్‌ వైట్‌హౌస్‌కు వచ్చాయని గత అధికారులు గుర్తుచేశారు. ఈ కేసులో దోషులగా తేలిన వారికి స్థానిక కోర్టు కఠిన శిక్షను సైతం ఖరారు చేసింది. అయితే అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగం జరగడం అధికారులను కలవరపెడుతోంది. తాజా ఘటనతో ట్రంప్ భద్రతా బృందం మరింత అప్రమత్తమైంది. అయితే ఆదివారం నాడు ఈ పార్శిల్‌తో సంబంధం ఉన్న ఒక కెనడా మహిళను న్యూయార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు FBI అధికారులు ధృవీకరించారు.