* బి.కొత్తకోట మండలంలో భార్యా భర్తలకు కరోన పాజిటివ్. ఇద్దరినీ ఆంబులెన్స్ ఎక్కిస్తుంటే భయపడ్డ భార్యాభర్తలు. భయంతో హార్ట్ ఎటాక్ వచ్చి భర్త మృతి వార్తను జీర్ణించుకోలేని భార్య కూడా కొంతసేపటికి మృతి.
* తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఒకేసారి మళ్లీ భారీగా పెరిగాయి… నిన్న 1,302 కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,143 మంది కరోనాబారినపడిన వాళ్లు కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774కు చేరుకోగా.. మృతుల సంఖ్య 1,052కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు 1,44,073 మంది రికవరీ అయ్యారు. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,649గా ఉండగా.. అందులో 22,620 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 166, మేడ్చల్ 147, కరీంనగర్ 127, నల్గొండ 113 కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి.
* ఏపీలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజులో 68,829 నమూనాలను పరీక్షించగా 7,553 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. 24 గంటల వ్యవధిలో 51 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, విశాఖపట్నం 6, కృష్ణా 5, ప్రకాశం 5, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, గుంటూరు 3, కడప 3, నెల్లూరు 3, పశ్చిమగోదావరి 3, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,461కి చేరింది. ఒక్కరోజులో 10,555 మంది పూర్తిగా కోలుకోగా.. 71,465 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 52,29,529 నమూనాలను పరీక్షించారు.
* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యానుంచి మరో వ్యాక్సిన్ రానుంది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ తయారుచేసిన ‘EpiVacCorona’ వ్యాక్సిన్ అక్టోబర్ 15నాటికి రిజిస్టర్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు రష్యా మీడియా సంస్థ టీఏఎస్‌ఎస్ వెల్లడించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఈ మధ్యే పూర్తయ్యాయి. వీటి ప్రయోగాల కోసం రష్యా ఆరోగ్యశాఖ నుంచి వెక్టార్ ఇనిస్టిట్యూట్ జులై నెలలోనే అనుమతి పొందింది.