ScienceAndTech

డ్రగ్స్ తీసుకోవడం వలన ఏమి జరుగుతుంది?

Drugs Are For Dopamine And What Else

హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు దక్షిణాదిలోనూ డ్రగ్స్‌పై మళ్లీ చర్చ మొదలైంది. డ్రగ్స్‌ (మాదక ద్రవ్యాలు)… ఉత్తేజాన్ని ఇస్తూనే ప్రాణాలు తీసే మహమ్మారి. సరదా కోసం, కిక్కు కోసం డ్రగ్స్‌ తీసుకోవడం మొదలెడతారు కొందరు. అది రానురానూ వ్యసనమైపోతుంది. ఆరోగ్యాన్నే కాదు జీవితాన్నీ దెబ్బతీస్తుంది. డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడతారు? ఈ వ్యసనం నుంచి ఎంత బయటపడాలనుకున్నా ఎందుకు సాధ్యం కాదు? చికిత్స పరమైన సవాళ్లు ఏమిటీ? ఈ విషయాలు తెలుసుకుందాం..
**దీర్ఘకాలికంగా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని తెలిసినా కూడా డ్రగ్స్‌ తీసుకోవడాన్ని ఒక అలవాటుగా కొనసాగించడమే డ్రగ్స్‌ అడిక్షన్‌. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల డ్రగ్స్‌ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.
***డ్రగ్స్‌ మెదడులోని డోపమైన్‌ అనే రసాయనం విడుదలను పెంచి కొండంత ఉత్తేజాన్ని ఇస్తాయి. మనందరిలోనూ ఉత్తేజానికి కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్‌ డోపమైన్‌ సాధారణంగా వంద శాతం ఉంటుంది. అదే మీరు కడుపారా భోజనం చేసినప్పుడు లేదా నచ్చిన సినిమా చూసినప్పుడు డోపమైన్‌ 150 శాతానికి చేరుతుంది. అదే సెక్స్‌లో పాల్గొనప్పుడు 200శాతంగా ఉంటుంది. అలానే డ్రగ్స్‌ వాడకం కూడా డోపమైన్‌ శాతాన్ని ఒక్కసారిగా పెంచుతుంది. ఉదాహరణకు ఆల్కహాల్‌ తీసుకుంటే 250శాతం, కొకైన్‌ వాడితే 300 నుంచి డోపమైన్‌ 400శాతానికి చేరుతుంది. మెదడులో ఉండే ఉత్తేజాన్ని కలిగించే వ్యవస్థ పనితీరు డ్రగ్స్‌ వల్ల పది రెట్లు పెరుగుతుంది. అందుకే డ్రగ్స్‌ తీసుకోవాలనుకుంటారు చాలామంది.
*ఉత్తేజాన్ని ఇస్తాయి కదా! మరి సమస్య ఏంటీ?
మొదటిసారి డ్రగ్స్‌ తీసుకున్నవారు పాజిటివ్‌ ఎఫెక్ట్‌కు లోనవుతారు. ఎప్పుడో ఒకసారి తప్ప డ్రగ్స్‌ తీసుకోవద్దని అనకుంటారు. అయితే జరిగేదేమిటంటే చాలా వరకు మత్తుపదార్థాలు శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపుతాయి. దీంతో రోజులు గడిచే కొదీ ఉత్తేజం కోసం కాకుండా సాధారణంగా ఉండేందుకు డ్రగ్స్‌ తీసుకుంటారు. వాటి వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ‘డ్రగ్స్‌ తెచ్చుకోవాలి. వాడాలి’ ఇదొక్కటే ఆలోచనగా ఉంటుంది. భారతదేశంలో ఆల్కహాల్‌, నికోటిన్‌ వాడకం చాలా ఎక్కువ. ఇన్‌హలెంట్స్‌ ద్వారా డ్రగ్స్‌ వాడేవారు చాలామంది ఉన్నారు.
*మానడం కష్టమా?
మొదట్లో డ్రగ్స్‌ తీసుకోవడం అనేది పూర్తిగా సొంత నిర్ణయంతోనే జరుగుతుంది. అయితే ఒకసారి డ్రగ్స్‌ వాడడం అలవాటుగా మారాక మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. డ్రగ్స్‌ ఆపేస్తే వారు ఇక ఏ పని మీద దృష్టి పెట్టలేరు. మెదడు ఇచ్చే ఆదేశాల్లో మార్పు రావడంతో నిర్ణయం తీసుకోవడం, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను నిత్యం తీసుకుంటూనే ఉంటారు.
*ఏదైనా చికిత్స ఉందా!
డ్రగ్స్‌ తీసుకోవడం మాన్పించి, వారు తిరిగి మునుపటి జీవితం గడిపేలా చేసేందుకు పరిశోధన ఆధారిత పద్ధతులు, అధ్యయనాలు ఉపయోగపడతాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల మాదిరిగా డ్రగ్స్‌కు బానిసలైన వారికి కూడా చికిత్స అందించవచ్చు. కోలుకొనేలా చేయవచ్చు. అయితే దీనికి పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ అందుబాటులో ఉన్న చికిత్సను కొనసాగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు.