శ్వేత కట్టి అంటే ముంబయిలో తెలియని వాళ్లుండరు. ఆమె పుట్టింది ముంబయిలోని కామాటిపురాలో. ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. రెడ్‌లైట్ ఏరియా అమ్మాయిగా అవమానాలందుకున్న శ్వేత ఇప్పుడు సైకాలజీగ్రాడ్యుయేట్. తన ధైర్యమే తనను ముందుకు నడిపించిందని చెప్పే శ్వేతను ఎన్నో అవార్డులు వరించాయి.
*శ్వేత ముంబయిలోని కామాటిపురాలో పుట్టింది. ఆ విషయాన్ని ఆమె ధైర్యంగా చెప్తుంది కూడా. దాంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. కానీ, వెనుకడుగు వేయలేదు. సెక్స్‌వర్కర్ అయిన తన తల్లి దగ్గర 16 ఏండ్ల వయసు వచ్చే వరకు పెరిగింది. తర్వాత 2012లో క్రాంతి అనే స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. ముంబయి మూలాలున్న ఎన్‌ఆర్‌ఐ రాబిన్ చౌరాసియా ఈ సంస్థను ప్రారంభించారు. ‘అప్నే ఆప్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆఫీసులో శ్వేతను కలిసిన ఆయన ఆమెలో నిద్రాణమై ఉన్న టాలెంట్‌ను గుర్తించాడు. అలా రెడ్‌లైట్ ఏరియా అమ్మాయిల జీవితాలను మార్చడమే ధ్యేయంగా కృషిచేస్తున్న క్రాంతి ఆవరణకు చేరిందామె. ఆ సంస్థ తరపున అట్టడుగు వర్గాల బాలికల కోసం పనిచేసి 2013లో, ‘న్యూస్ వీక్-అండర్ 25 విమెన్’ జాబితాలో మలాలాతో పాటు చోటు దక్కించుకున్నది. 2014లో అనేక ఇతర అవార్డులతో పాటు ఐక్యరాజ్య సమితి యూత్ కరేజ్ పురస్కారాన్ని కూడా పొందింది.
*గతమంతా గాయాలే
శ్వేత తన పాత జీవితాన్ని మరిచిపోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఆమె తాత ఒక వ్యభిచార గృహం నడిపేవాడు. శ్వేత అమ్మమ్మ గర్భవతిగా ఉండగానే అతను మరణించాడు. తల్లి కూడా ఒక పెండ్లయిన వ్యక్తిని ప్రేమించింది. అతని సంతానమే శ్వేత. అతను చనిపోయిన తర్వాత ఆమె తల్లి మరో వ్యక్తితో అనుబంధం కొనసాగించింది. అతని ఇంటిపేరైన కట్టితోనే శ్వేత చలామణి అయింది. అయితే అతను రోజూ తన తల్లిని కొట్టడం, దుర్భాషలాడటం లాంటివి చేసేవాడు. పక్కింట్లో ఉండే మరో సెక్స్ వర్కర్ ఆమెకు చదువు విలువ గురించి చెప్పింది. చదువుకోకపోతే జీవితం ఎంత దుర్భరం అవుతుందో వివరించింది. ఆ మాటలు శ్వేతపై బాగా పనిచేశాయి. అప్పటి నుంచి చదువుపై శ్రద్ధ పెట్టింది.
*తనలాంటి వారికి అండగా
ఒక్కోమెట్టూ ఎదుగుతూ 2013లో న్యూయార్క్‌లోని బార్డ్ కాలేజీలో సైకాలజీ ప్రధానంగా గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరింది. అక్కడ 30వేల డాలర్ల స్కాలర్‌షిప్‌ను అందుకుంది. అలా రెడ్‌లైట్ ఏరియా నుంచి విదేశీ విద్య కోసం వెళ్లిన మొదటి భారతీయ విద్యార్థి అయింది. అమెరికా వెళ్లడానికి ముందు నేపాల్, ఝార్ఖండ్, బెంగళూరు, గోవా పర్యటించి లింగ వివక్ష, లైంగికత గురించి అనేక సెమినార్లలో యువతను ఉద్దేశించి మాట్లాడింది. అమెరికా చదువు శ్వేత వ్యక్తిత్వాన్నే మార్చేసింది. ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబిన్ చౌరాసియా, అతని ఎన్‌జీవో క్రాంతి లేకపోతే తను లేనని చెప్తుందామె. ఇప్పుడు సెక్స్ వర్కర్లు, వారి పిల్లలకు విద్య, పలు విషయాల్లో అవగాహన కల్పించడమే తన లక్ష్యం అంటున్నది శ్వేత. అన్నింటికీ మించి చిన్నప్పటి నుంచీ కష్టం తప్ప తెలియని తన తల్లికి సౌకర్యవంతమైన జీవితం కల్పించాలని ఆశ పడుతున్నది. ఆ ఆశయాలు ఫలించాలని ఆశిద్దాం.
కామాటిపుర రొచ్చు నుండి సైకాలజీ గ్రాడ్యూయేట్ వరకు…
Related tags :