Politics

నాలుగేళ్లల్లో ₹517కోట్లు ఖర్చు చేసిన మోడీ

నాలుగేళ్లల్లో ₹517కోట్లు ఖర్చు చేసిన మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను సందర్శించారు. ఈ మొత్తం వ్యయం 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోదీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు. ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రధానమంత్రి సందర్శించిన ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు ఒకసారి చైనాలో పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌ను కూడా మోదీ సందర్శించారు. అయితే కరోనా, ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని వివరించారు. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయన్నారు. తద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై ఇతర దేశాలలో అవగాహనను పెంచిందని మురళీధరన్ చెప్పారు. కాగా 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్‌లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వికె సింగ్ ప్రకటించిన డేటా ప్రకారం జూన్ 15, 2014, డిసెంబర్ 2018 మధ్య కాలంలో ప్రధానమంత్రి విమానాల నిర్వహణ ఖర్చు 1,583.18 కోట్లు, చార్టర్డ్ విమానాల కోసం 429.25 కోట్లు ఖర్చు చేశారు. హాట్‌లైన్‌ వసతుల కోసం మొత్తం ఖర్చు 9.11 కోట్లుగా ప్రకటించారు. మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీల విసుర్లు, ప్రధానంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు, వ్యవసాయ రంగంలో సంక్షోభ సమయంలో విదేశీ పర్యటనలు అవసరమా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.